School Holiday: రాజమహేంద్రవరం వద్ద పులి సంచారం.. నేడు, రేపు స్కూళ్లకు సెలవులు

School Holiday: రాజమహేంద్రవరం పరిసరాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు స్కూళ్లకు నేడు, రేపు సెలవులు ప్రకటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Feb 2026 12:24 PM IST
School Holiday: రాజమహేంద్రవరం వద్ద పులి సంచారం.. నేడు, రేపు స్కూళ్లకు సెలవులు
X

School Holiday: రాజమహేంద్రవరం వద్ద పులి సంచారం.. నేడు, రేపు స్కూళ్లకు సెలవులు

School Holiday: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నగర శివారులోని విశాఖపట్నం–విజయవాడ జాతీయ రహదారి సమీపంలో పులి ప్రత్యక్షమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి దృష్ట్యా అధికారులు పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి తాజాగా రాజమహేంద్రవరం నగర శివారుకు చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. మంగళవారం రాత్రి ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పులి కనిపించడంతో అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) వైపుగా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆందోళన మరింత పెరిగింది.

విద్యాసంస్థలకు సమీపంలో పులి సంచారం కొనసాగుతుండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు నేడు, రేపు సెలవులు ప్రకటించారు. హైవే సమీపంలోని కొబ్బరి తోటలు, నివాస ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పుణె నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రాజమహేంద్రవరం రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులి పాదముద్రలను అనుసరిస్తూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గతంలో జనవరి 20న ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మొదటిసారిగా పులి సంచారం గుర్తించగా, జనవరి 31న గోదావరి నదిని దాటి సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 1న తొర్రేడు గ్రామంలో ఆవులు, దూడపై దాడి చేసి చంపిన ఘటన స్థానికులను మరింత భయాందోళనకు గురిచేసింది. తాజాగా ఫిబ్రవరి 3న రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని తోటల్లో పులి పాదముద్రలు లభించాయి.

ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్, హైవే పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story