logo
ఆంధ్రప్రదేశ్

అగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?

Reasons for Kodali Nani Perni Nani Anil Kumar Yadav Silent in YCP | YS Jagan | Off The Record
X

అగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?

Highlights

YCP Fire Brands: ముగ్గురు అగ్గిబరాటల నిశ్శబ్దం దేనికి సంకేతం..?

YCP Fire Brands: వాళ్లు మాట్లాడితే పేలేవి తూటాలే! వాళ్లు డైలాగ్‌ విసిరితే వచ్చేది పెను తుపానే! ప్రతీ పలుకూ అంతటి సంచలనమే. ప్రత్యర్థులపై మైక్‌ పట్టారా ఇక అంతే. దద్దరిల్లిపోవాల్సిందే. వాళ్ల మాటల్లో పంచ్‌లతో పాటు సబ్టెక్టూ ఉంటుంది కానీ హైలెట్‌ అయ్యేది కర్ణకఠోర మాటలే. అలాంటి అగ్గిబరాటలు ఇప్పుడు ఎందుకనో కాస్త సైలెంట్‌ మోడ్‌లోకి మారిపోయారట. ఏపీలో ఈ రేంజ్‌లో డైలాగ్‌వార్‌ సాగుతున్నా మౌనంగానే ఉంటున్నారట. లౌడ్‌ స్పీకర్‌లాంటి ఆ నాయకులు, ఇప్పుడెందుకు సౌండ్‌ తగ్గించేశారు? కంట్రోల్ అయ్యారా లేదా... అధిష్టానమే కంట్రోల్ చేసిందా? ఇంతకీ ఎవరా లీడర్? ఆ సైలెన్స్‌కు రీజనేంటి..?

కొడాలి నాని. గుడివాడ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖకు మాజీ మంత్రి. నాని మాట్లాడినా సంచలన వార్తే. మాట్లాడకపోయినా సంచలన వార్తే. ఆయనంతే. ఆయన తీరంతే. కుండబద్దలు కొడతారని ఆయన గురించి మాట్లాడటం చాలా చిన్నపదం. ప్రత్యర్థులను కుళ్లబొడుస్తారని వర్ణించడం కూడా స్మాలే. నీతులైనా, బూతులైనా ఊర మాస్‌గా డెలీవరీ చెయ్యడం ఆయనకే చెల్లు. కొడాలి నాని ఒక లౌడ్‌ స్పీకర్‌. మైక్‌ పట్టాడంటే, అవతలి వ్యక్తి మైక్‌ విరిగిపోవడం ఖాయం. కానీ ఇప్పుడా మైక్‌ మూగబోయినట్టుంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతుంటే, వైసీపీ నేతలు కూడా కౌంటర్‌ ఇస్తున్నా, గట్టి కౌంటర్‌ లోటేదో కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఆ లోటు... మాటల పోటు పొడిచే కొడాలి నాని మౌనమేనంటున్నారు వైసీపీ కార్యకర్తలు.

ఏ సామాజికవర్గం నాయకులు విమర్శలు చేసినా, అదే సామాజికవర్గం నేతలతో కౌంటర్ ఇప్పించడం వైసీపీ ట్రెండు. అదే సామాజికవర్గం నేతలతో తిట్టిస్తే, అదే కులంలో పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకతా రాదనేది వైసీపీ స్ట్రాటజీ. అందుకే, కాపు వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా మరెందరో కాపు నేతలపై, అదే వర్గానికి చెందిన పేర్ని నాని‌తో పంచ్‌లు కురిపించేది వైసీపీ అధిష్టానం.

అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కూడా సేమ్‌ టు సేమ్‌. ఆయన విషయంలో కూడా సీన్‌ రిపీట్‌ అయ్యేది. కాకపోతే మనోడికి మాగ్జిమమ్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు అప్పట్లో అధినేత జగన్‌. చంద్రబాబైనా, లోకేష్‌ అయినా, పవన్‌ అయినా... ఇంకెవరైనా తాను ఎంటర్‌ కానంత వరకే అన్నట్టుగా ఉండేది సీన్‌. అసెంబ్లీ లోపలా, బయటా టీడీపీ కమ్మ నేతలను మాటలతో కుమ్మిపడేసేవారు. ఇలా ఒకపక్క నాని స్క్వైర్‌, మరోపక్క అనిల్‌‌కుమార్‌... అసెంబ్లీలో ఒక రేంజ్‌లో రెచ్చిపోయేవారు.

కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌... ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నా, ఈ ముగ్గురు ఫైర్‌బ్రాండ్స్‌ మాత్రం ఒక్క మాటా మాట్లాడటం లేదు. ప్రెస్‌మీట్లు పెట్టడం లేదు. అసలు మీడియాలో కనపడటం లేదు. లౌడ్‌ స్పీకర్‌గా చెలరేగిపోయే కొడాలి నాని మొన్నీ మధ్య మరి బాగోదనుకున్నారో ఏమో... పవన్‌ కాస్త గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. కానీ అదేమీ పెద్దగా ఆనలేదన్న టాక్‌ ఉంది. మరీ ముఖ్యంగా కొడాలి నాని నోరు తెరిస్తే బూతే అన్నట్టుగా ముద్ర పడిపోయింది. అసెంబ్లీ లోపలా, బయటా, బహిరంగ సభయినా, ప్రెస్‌మీటయినా, నా...బూతే నభవిష్యత్‌ అన్నట్టుగా నోటికి పనిచెప్పేవారు నాని. కానీ బూతుల రాగం శ్రుతిమించింది. మైక్ పట్టుకున్నాడంటే, బండ బూతేదో వినక తప్పదని చాలామంది తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. మహిళలైతే చెవులు మూసుకోవాల్సిందే. ఆ ఊర మాస్‌ డైలాగుల దూకుడే తనకు ప్లస్సనుకున్నారు నాని. పార్టీ కూడా అసెట్‌ అనుకుంది. కానీ ఉభయులకూ అదే మైనస్‌గా మారిందన్న చర్చ జరుగుతోంది.

అయితే, ఈ ముగ్గురి కాంట్రావర్సి కామెంట్లతో పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నందు వల్లే వీళ్లు ష్‌... గప్‌చుప్‌ పాటిస్తున్నారన్న చర్చ జరుగుతున్నా... దాన్ని వైసీపీ నేతలే కొట్టిపారేస్తున్నారు. అలాంటిదేం లేదంటున్నారు. కొడాలి సహా పేర్ని నాని, అనిల్‌కుమార్‌‌కు పార్టీలో మంచి ఫేము, నేమూ వుందని, సీఎం జగన్‌కు వీళ్లు ముగ్గురు నమ్మినబంటు అని, హైకమాండ్‌‌కు వీరిపై ఎలాంటి కంప్లయింట్స్ లేవని చెబుతున్నారు. కాకపోతే పూర్తిస్థాయిలో నియోజకవర్గం పనుల్లో బిజీగా వున్నారని అంటున్నారు పార్టీ నేతలు. కష్టకాలంలో తన వెంట ఉండి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్ల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నారట. అందుకే నియోజకవర్గం ప్రజలకి నిత్యం అందుబాటులో వుంటున్నారట.

ఏమైనా నిత్యం మాటల తూటాలు పేలుస్తూ, ఒక్కసారిగా మౌనంలోకి జారుకుంటే, ఇలాంటి డౌట్సే అందరికీ వస్తాయి. ముఖ్యంగా కొడాలి నాని వంటి లౌడ్‌ స్పీకర్‌‌ లీడర్లు, ఇలాంటి డైలాగ్‌ వార్‌ టైంలో నిశ్శబ్దంగా వుంటే, ఇంకా చాలా సందేహాలు, ప్రచారాలు చక్కర్లు కొడతాయి. కారణం ఏదైనా, కొడాలి నాని, పేర్నీ నాని, అనిల్‌కుమార్‌ నిశ్శబ్దం, కాంట్రావర్సీ రగిల్చే శబ్దం కన్నా దారుణంగా వుందంటున్నారు వైసీపీ కార్యకర్తలు. మరి వీరి మౌనానికి అసలు కారణమేంటో, వాళ్లే నోరు విప్పి చెప్పాలి. అప్పటిదాకా ఇలాంటి రూమర్స్‌ వినాల్సిందే. అందుకే వెయిట్‌ అండ్‌ సీ.


Web TitleReasons for Kodali Nani Perni Nani Anil Kumar Yadav Silent in YCP | YS Jagan | Off The Record
Next Story