గుంటూరు జిల్లాలో చెలరేగిపోతున్న రేషన్ మాఫియా

Ration Rice Mafia in Guntur
x

గుంటూరు జిల్లాలో చెలరేగిపోతున్న రేషన్ మాఫియా

Highlights

Guntur: పక్కదారి పడుతున్న పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం

Guntur: ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో.. కోట్ల రూపాయల రేషన్ బియ్యం, ఓడరేవుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో నిరుపేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు లాగేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌ బిల్లులతో జాతీయ రహదారే రాజమార్గంగా.. ఓడరేవులకు టన్నుల కొద్ది సరకు దాటిస్తున్నారు. అక్కడ నౌకలకు ఎక్కించి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెన్నై-కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరిపేట నియోజకవర్గం ఉంది. దీనికి తోడు పల్నాడుతో పాటు బాపట్ల, గుంటూరు జిల్లాలకు సరిహద్దు ప్రాంతం చిలకలూరి పేట. ఆయా జిల్లా పరిధిలోని చౌక దుకాణాల నుంచి సేకరించిన పౌరసరఫరా శాఖ బియ్యం బస్తాలను అనుమానం రాకుండా, సరకు పంపిణీ సంచార వాహనాల్లోనే తీసుకొస్తున్నారు. స్టోరేజ్ గోదాంలో తెల్లసంచుల్లో నింపి, మిషన్‌తో కుట్లు వేసి నకిలీ లేబుల్స్‌ తగిలిస్తున్నారు. ఆయా రైస్‌ మిల్లుల పేరుతో ఆన్‌లైన్‌లో బిల్లులు తీసుకుంటున్నారు. రాత్రి పూట లారీలకు బస్తాలు ఎక్కించి కాకినాడ ఓడరేవుకు తరలిస్తున్నారు. మార్గమధ్యలో తనిఖీ అధికారులకు పట్టుబడకుండా మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది, ప్రత్యేక కాపలాదారులతో పర్యవేక్షిస్తున్నారు

16వ నంబరు జాతీయ రహదారిని అక్రమార్కులు రాజమార్గంగా ఎంచుకున్నారు. ప్రణాళిక ప్రకారం లారీల్లో సరకు తరలిస్తున్నారు. వాటి ముందు భాగంలో కారు వారికి రక్షణగా వెళుతుంది. ప్రతి నెలా తొలి పక్షంలో వందలాది లారీల సరకు కాకినాడకు తరలిస్తున్నారు. చిలకలూరిపేట.. గుంటూరు.. నరసరావుపేట.. పిడుగురాళ్లకు చెందిన కొందరు వ్యక్తులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. సిండికేట్‌గా ఏర్పడి కోట్లరూపాయల్లో లావాదేవీలు సాగిస్తున్నారు. వీరిని కాదని వేరొకరు వ్యాపారం చేస్తే వారిని అధికారులకు పట్టిస్తున్నారు. వచ్చిన సొమ్మును వాటాలేసుకుని పంచుకుంటున్నారు. ఒకవేళ అధికారులు, పోలీసులకు పట్టుబడితే సర్కారు పెద్దలతో సిఫార్సు చేయించుకుని కేసులు లేకుండా బయటపడుతున్నారు

రేషన్‌ పంపిణీ నిర్వహించే తొలి రోజు రాత్రిపూట నుంచే ఈ తంతు మొదలవుతోంది. పల్లెలు, పట్టణాల్లోని చౌక దుకాణాల నుంచి దాదాపు 120 లారీల సరకు సేకరించి, తెల్ల సంచుల్లోకి మార్చి ఓడరేవుకు పంపుతున్నారు. నిత్యం వీధుల్లో పహారా పోలీసుల కళ్లు కప్పి ఇదంతా సాగించడం అసాధ్యం. ఇక పౌర సరఫరా శాఖ, విజిలెన్స్‌ అధికారులకు సమాచారం తెలిసినా.. చిలకలూరిపేటలో అడుగు పెట్టే సాహసం చేయడం లేదు. కార్యాలయాలు, రాజకీయ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు, సభలకు వచ్చే జనానికి భోజనాలు తదితర ఖర్చులన్నీ అక్రమార్కులు భరిస్తున్నారన్న సమాచారం ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులకు మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం.

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులు పాలవుతుంది. రేషన్ మాఫియా కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories