రామతీర్థంపై రాజకీయ రగడ.. పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన

రామతీర్థంపై రాజకీయ రగడ.. పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన
x
Highlights

రాజకీయ రగడకు దారి తీసిన ఈ ఘటనను పోలీసులు సీరియన్‌గా తీసుకున్నారు.

రామతీర్థం ఘటనపై సవాళ్ళు, ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన వైసీపీ వర్సెస్‌ టీడీపీగా టర్న్‌ తీసుకుంది. విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ హస్తం ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇక అప్పటి నుంచి విజయసాయి, నారా లోకేష్‌ మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది.

రామతీర్థం ఆలయంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. ఆలయంలో సీసీ టీవీ కెమెరాలు పెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరాలు బిగించడానికి ఒక రోజు ముందుగా ఈ దుశ్చర్య జరిగింది. రాజకీయ రగడకు దారి తీసిన ఈ ఘటనను పోలీసులు సీరియన్‌గా తీసుకున్నారు. ఇప్పటికే 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ వల్లనే కోనేరులో విగ్రహం తల ఉన్నట్లుగా తెలిసింది. వెంటనే దాన్ని బయటకు తీసారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బ్రుందాలను నియమించారు. ఉద్దేశ పూర్వకంగా, వర్గాల మధ్య గొడవలు స్రుష్టించడానికి ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలోనే దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది.

రామతీర్థం ఘటన వెనక తెలుగుదేశం అగ్రనేతల హస్తం ఉందని వైసీపీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. వారి ప్రమేయాన్ని నిరూపించే సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు విజయసాయి ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రోజు ఆలయంలో విగ్రహాన్ని ధ్వసం చేశారని చెప్పారాయన. విజయసాయి ఆరోపణ చేసిన కాసేపటికే..తెలుగుదేశం ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ దీన్ని ఖండించారు. విగ్రహం ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రమాణం చేస్తాను..మీరు చేస్తారా ముఖ్యమంత్రిగారూ అంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు. దీనికి సమాధానంగా రామతీర్థం సందర్శనలో నారా లోకేష్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు విజయసాయి ప్రకటించారు.

విజయసాయి మీడియాతో మాట్లడిన కొద్దిసేపటికే నారా లోకేష్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. తను సీఎంకు సవాల్‌ విసిరితే..వేరేవారు స్పందించారెందుకంటూ సెటైర్లు వేశారు. ఏ1కు దమ్మూ, ధైర్యం లేదా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు నారా లోకేష్‌. తనపై వైసీపీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని విజయసాయి స్పందనతోనే తేలిపోయిందని కామెంట్‌ చేశారాయన. తనపై చేసిన చేయిస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉంటే.. సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చేయడానికి జగన్‌ సిద్ధమా.. అంటూ మరోసారి సవాల్‌ చేశారు నారా లోకేష్‌.

రామతీర్థంలో టెంట్‌ వేసి హడావుడి చేస్తున్న బీజేపీ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఏపీ ఇన్‌‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ, టీడీపీలను తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రాంతీయ పార్టీలు ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు విజయవాడలో అనేక ఆలయాలను కూల్చివేశారని..ఇప్పుడు ఆయనే రామతీర్థం విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ విమర్శించారు దేవ్‌ధర్‌. జనవరి 4న రామతీర్థంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. దేవాలయాలపై దాడులు రాజకీయాంశం కాదని..ఆత్మాభిమానం..స్వాభిమానానానికి సంబంధించిన విషయమని చెప్పారాయన.

జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో అనేక ఆలయాల్లో దాడులు, విధ్వంసాలు జరిగాయి. వీటిని రాజకీయంగా వాడుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రామతీర్థం విషయంలో పార్టీల ఎంట్రీతో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, బీజేపీ, వైసీపీలు పోటా పోటీగా ఒకేరోజు ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళడంతో ఆ ఊరిలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల్ని పట్టుకోవాల్సిన పోలీసులకు.. రాజకీయ నాయకుల పర్యటనకు బందోబస్తు చేయడంతోనే సరిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories