Ramatheertham issue: ఏపీ రాజకీయాల్లో రామతీర్థం రగడ

Ramatheertham issue in ap
x

representational image

Highlights

Ramatheertham issue: * రామతీర్థం ఘటనతో హీటెక్కిన రాజకీయం * ఏపీలో వరుసగా హిందూ ఆలయాలపై దాడులు * ప్రభుత్వ వైఫల్యమేనని ప్రతిపక్షాల ఆరోపణ

Ramatheertham issue: రామతీర్థ ఘటనతో రాష్ట్ర రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. రాములవారి శిరచ్ఛేదనతో అన్ని పార్టీలు రాజకీయ చదరంగానికి తెర లేపాయి. దీంతో ప్రశాంత రామతీర్థం క్షేత్రం... కాస్త రాజకీయ రణక్షేత్రంగా మారింది. దేవుళ్ళ పై దాడుల విషయం దేవుడెరుగు..మైలేజీ కోసం అన్ని రాజకీయ పార్టీలు దేవాలయాల టాపిక్‌ ఎత్తుకొనేసరికి పొలిటికల్‌ హిట్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రామతీర్థం ధర్మయాత్ర పేరుతో బీజేపీ, జనసేన పర్యటన అత్యంత ఆశక్తిగా మారింది.

ప్రశాంత రామతీర్థం క్షేత్రం రాజకీయ రణరంగంలా మారింది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ నిరసనలతో ఏపీలో నిప్పులు రాజుకున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థం లోని రామాలయం లో రాముడు విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. డిసెంబర్ 29న జరిగిన ఈ సంఘటన పెద్ద కలకలం రేపింది. సంఘటనా స్థలానికి టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన ఇలా అన్ని పార్టీల నాయకులు వెళ్లడంతో పెద్ద దూమారమే రేగింది. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తూ, ఏపీలో వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అని, ప్రభుత్వం పని గట్టుకుని ఈ వ్యవహారాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆలయాలపై వరుస దాడుల ఘటనకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక రామతీర్థం ఘటనలో ప్రభుత్వం తీరును చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. రామతీర్థం(Ramatheertham issue) ఘటనలో అసలైన దోషులను పట్టుకోవడం మానేసి, అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలని హింసిస్తున్నారని ఆరోపించారు. అధికారులు కోరితే ప్రమాదకరమైన బావిలో దిగి సహకరించినందుకు అతనికి, అతని కుటుంబానికి ద్రోహం చేస్తారా? అని నిలదీశారు. "నేరాన్ని టీడీపీ మీదకు నెట్టాలనుకునే కుట్రలను సహించేది లేదు జాగ్రత్త!" అంటూ చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నేతలు ఈ వ్యవహారాలకు పాల్పడుతూ, ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ ప్రజా సమస్యల విషయాన్ని సైతం పక్కనపెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు దేవాలయాలపైనే దృష్టి సారించాయి.

ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఏపీలో అగ్గిరాజేసిన రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. 8 ఆలయాల్లో జరిగిన వివిధ ఘటనల్లో 88 కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు 159మందిని అరెస్ట్ చేసినట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

ఇక రామతీర్థం(Ramatheertham issue) ధర్మయాత్ర పేరుతో నిరసన కార్యక్రమానికి జనసేన, బీజేపీ సిద్ధమైయ్యాయి. రామతీర్థం ధర్మ యాత్రకు సిద్ధం కావాలంటూ ఇరు పార్టీలు పిలుపునిచ్చాయి. పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రామతీర్థం రానున్నారు. రామతీర్దంలోని బోడి కొండపైన ఉన్న రామాలయంలో రాములవారి విగ్రహం ద్వంసం చేసిన ప్రాంతాన్ని బిజేపి, జనసేన నాయుకులు సందర్శించి పరిశీలించనున్నారు. అయితే రామతీర్థంలో ఎటువంటి దీక్షలుగానీ ఎవ్వరూ పర్యటనలకు గానీ అనుమతులు లేవని ఇప్పటికే ఆలయం ప్రాంతాన్నీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పటిష్ట బందోబస్తున్న ఏర్పాటు చేసారు. అంతేకాక ఎవ్వరినీ బోడి కొండపైకి వెళ్ళకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రామతీర్థంలో ఎవ్వరిని అనుమతించడం లేదు. బిజేపి, జనసేన నాయుకుల పర్యటనకు ఎటువంటి అనుమతులు పోలీసులు ఇవ్వలేదని ప్రచారం కొనసాగుతోంది. తమ పర్యటనకు అనుమతి ఇవ్వకున్నా రామతీర్థం సందర్శించి తీరుతామని బిజేపి నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో నేడు బిజేపి రాష్ట్ర నేతలతో పాటు జనసేన నేతల పర్యటన అత్యంత ఆశక్తిగా మారింది. పోలిటికల్ హిట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

మొత్తంగా ఏపీ రాజకీయాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. వరుస దాడుల ఘటనలను ప్రజలు ఎంత ఆసక్తిగా గమనిస్తున్నారో తెలియదు కానీ.. రాజకీయ పార్టీల్లో మాత్రం విమర్శలు, ప్రతి విమర్శలకు.. ఎత్తులు, పై ఎత్తులకు అవకాశం కల్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories