శ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్

Ram Mohan Naidu Vs Achchan Naidu in Srikakulam TDP | AP News
x

శ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్

Highlights

Srikakulam: ఎవరికి వారే యమునా తీరేనా?

Srikakulam: బాబాయ్-అబ్బాయ్. ఇద్దరికీ ఇద్దరంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత. రాజకీయంగానూ గొడవల్లేవు. అప్పట్లో ఓసారి బాబాయ్ అరెస్టు అయినప్పుడు, దిక్కులు పిక్కటిల్లేలా గొంతు విప్పారు అబ్బాయి. మా చిన్నాన్ననే అరెస్టు చేస్తారా అంటూ కళ్లెర్రజేశారు. ఇప్పుడు అదే అబ్బాయికి ఎక్కడో గుచ్చుకుంటోందట. రాబోయే కాలంలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ యుద్దం తప్పదేమోనన్న చర్చ కూడా జరుగుతోందట. అందుకే సిక్కోలు జిల్లాలో ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారట. ఎవరి మంత్రాంగం వారే నడుపుకుంటున్నారట. ఇంతకీ ఎవరా బాబాయ్‌ ఎవరా అబ్బాయ్‌.?

కింజారపు అచ్చెన్నాయుడు, కింజారపు రామ్మోహన్‌నాయుడే బాబాయ్‌-అబ్బాయ్‌లు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి సిక్కోలు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారట.

అందుకే హార్డ్‌కోర్‌ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఒక్కటే మాట అంటున్నారట ఒకప్పటి కంచుకోటకు ఇప్పుడేమైందీ అని? ఇంతమంది సీనియర్లు ఉన్నా ఎవరికి వారే యమునాతీరేలా ఉండటం వాళ్లకు నచ్చడ లేదట . ఎవరి ప్రాభల్యం వారే చూసుకుంటున్నారట. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నా ఎవరి దారి వారే చూసుకోవడం వల్ల పార్టీ నష్టపోయే అవకాశం ఉందని అధినేతకు కబురు పంపుతున్నారట.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న సిక్కొలు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నియోజకవర్గాలు 8కి పరిమితం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు జిల్లాలకు అన్నీ తామై నడిపించాల్సిన సీనియర్ నేతలైన కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతిలోనే ఉంటున్నారట. మరో సీనియర్‌ కిమిడి కళా వెంకటరావు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాంలోనే ఇంటికే పరిమితం అవుతున్నారట. ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా అంతేనట.

వీళ్లు ముగ్గురు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకులే అయినా ఈ ముగ్గురిలో ముగ్గురికి సరిగ్గా పడదట. జిల్లా కార్యాలయంలో ఏదైనా కార్యక్రమం చేస్తే కళా వెంకటరావు వస్తే మిగిలిన ఇద్దరు రారట. అచ్చెన్నా రామ్మోహన్‌ వస్తే వెంకట్రావు రారట. ఇదే ప్రస్తుతం సిక్కోలు జిల్లా పార్టీలో చర్చనీయాంశంగా మారగ, సీనియర్ల మంత్రాంగం ఏంటో, వారి మనసులో ఏముందో అర్థం కాక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట.

గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా జగన్‌ వేవ్‌లో కూడా రామ్మోహన్‌నాయుడు 6వేల ఓట్లతో ఎంపీగా విజయం సాధించారు. తండ్రి ఎర్రన్నాయుడు నుంచి వస్తున్న క్యాడర్‌ను కాపాడుకుంటున్న రామ్మోహన్‌ వైపు ఇప్పటికీ జిల్లా ఓటర్లు కూడా ఉన్నారని క్యాడర్‌ చెప్పుకుంటుంది. కానీ, ఇప్పుడు జిల్లాలో సీన్‌ మారడంతో, వచ్చే వేవ్‌ ఎలా ఉన్నా ఈ నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది.

సమిష్టిగా పనిచేస్తేనే ఈసారి అధికారంలో వస్తామని పైకి చెప్పుకుంటున్నా వీరి గ్రూపు రాజకీయాల వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని క్యాడర్‌ చెప్పుకుంటుంది. గతంలో ఇద్దరూ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా చేసినవారే కానీ, జిల్లాను గాలికొదిలేశారనే వాదన కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే వైసీపీ ప్రభుత్వంపై ఒకింత అసహనంగా ఉన్న ఉద్యోగులను, టీచర్లు, క్షేత్రస్థాయి ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ఇద్దరూ సీనియర్ నాయకులు ఒకరిపై ఒకరు తెరవెనుక కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అచ్చెన్న, రామ్మోహన్‌ మధ్య అంతర్గత పోరు వల్లే గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తక్కువ మెజార్టీతో ఓడిపోయినా అదేంటో గ్రహించకుండా అదే కోల్డ్‌వార్‌‌ను వీరిద్దరూ కంటిన్యూ చేస్తున్నారట. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉంటే అధికారం కోసం పనిచేయాలే తప్ప ఒకరిపై ఒకరు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తే కంచుకోటకు మరింత బీటలు వారుడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. రాజాం, పాలకొండ, ఎచ్చర్ల టీడీపీలో రెబెల్స్‌ వార్నింగ్‌ బెల్స్‌ మోగించడం వెనుక కూడా వీళ్లిద్దరే కారణమన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికైనా తెలుగుదేశం అధిష్టానం సిక్కొలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల వారిని ఒకతాటిపైకి తీసుకొని రావాలని క్యాడర్‌ కోరుకుటుంది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన అచ్చెన్నాయుడుపైనే ఈ బాధ్యత ఎక్కువగా ఉంటుందని క్యాడర్‌ అనుకుంటోంది. ఇప్పుడిప్పుడే క్యాడర్ పుంజుకుంటున్న వేళ సీనియర్ నేతలు ఒక్కటవ్వకపోతే జిల్లాలో టీడీపీ మరింత అధఃపాతాళానికి వెళుతుందని వారు ఆవేదనగా మాట్లాడుకుంటున్నారు. మరి బాబాయి అబ్బాయిలు ఇద్దరు ఏకమవుతారా ఎవరికి వారు ఏకు మేకవుతారా చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories