సీఎం జగన్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ గా పూడి శ్రీహరి

సీఎం జగన్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ గా పూడి శ్రీహరి
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్వో)గా పూడి శ్రీహరి నియమితులయ్యారు. విశాఖపట్నంలో పాత్రికేయుడిగా తన వృత్తిని...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్వో)గా పూడి శ్రీహరి నియమితులయ్యారు. విశాఖపట్నంలో పాత్రికేయుడిగా తన వృత్తిని ప్రారంభించిన శ్రీహరి, గడచిన 19 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. అనేక ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్‌ న్యూస్‌ కో–ఆర్డినేటర్‌గా, ఇన్‌పుట్‌ ఎడిటర్‌గా పలుకీలక బాధ్యతలు నిర్వహించారు. యాంకర్‌గా అనేక చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. క్షేత్రస్థాయి సమాచార సేకరణ, విశ్లేషణలో శ్రీహరికి విశేష అనుభవం ఉంది. అనేక అసైన్‌మెంట్లను సమర్థవంతంగా నిర్వహించారు. గడచిన 2 సంవత్సరాలుగా వై.యస్‌.జగన్‌ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. 14 నెలలు పాటు 3648 కిలోమీటర్లు సాగిన వై.యస్‌.జగన్‌ సుదీర్ఘ పాదయాత్రలో తొలిరోజు నుంచి చివరి రోజువరకూ కొనసాగారు. నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచార సేకరణ, అధ్యయనం, మీడియా వ్యవహారాల బాధ్యతలను నిర్వర్తించారు. వై.యస్‌. జగన్‌ రాజకీయ ప్రస్థానం, పాదయాత్రలను ప్రధాన అంశాలుగా చేసుకుని సమగ్ర వివరాలతో ''అడుగడుగునా అంతరంగం'' అనే పుస్తకం కూడా రాశారు. ఎన్నికలకు ముందు ఈ పుస్తకాన్ని వై.యస్‌.జగన్‌ ఆవిష్కరించారు.

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం మామిడిపల్లిలో పూడి శ్రీహరి జన్మించారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీహరి ఉన్నత పాఠశాల నుంచి డిగ్రీ వరకూ విశాఖపట్నంలోనే చదువుకున్నారు. డిగ్రీ చివరి సంవత్సరంలోనే విశాఖ జిల్లా రూరల్‌ రిపోర్టర్‌గా తన కెరీర్‌ ప్రారంభించారు. లా సెట్‌లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సంపాదించి ఆంధ్రా యూనివర్శిటీలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ న్యాయకళాశాలలో సీటు సంపాదించి, రెండు సెమిస్టర్లు పూర్తిచేసినప్పటికీ, ఈనాడు జర్నలిజం స్కూలుకు ఎంపికకావడంతో జర్నలిజంవైపే మొగ్గు చూపారు.కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత మొదట డెస్క్‌ జర్నలిస్టుగా తర్వాత కో–ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. నాలుగు సార్వత్రిక ఎన్నికల కవరేజీ, వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగాల్లో శ్రీహరికి విశేషం అనుభవం ఉంది. వార్త పుట్టక నుంచి దాని ప్రసారం, ప్రచురణ అయ్యేంత వరకూ జరిగే ప్రక్రియలన్నింటిపైనా ఆయనకు పట్టు ఉంది. దినపత్రిక పేజినేషన్, వార్తాంశాల ప్రాధాన్యతల నిర్దారణతో పాటు, టీవీ ఛానళ్లలో ఎడిటింగ్, ఆన్‌లైన్‌ కవరేజీ, గ్రాఫిక్స్‌ తదితర రంగాల్లో విశేష అనుభవం ఉంది. స్వయంగా ఎడిటింగ్, ఆన్‌లైన్‌ ఎడిటింగ్, ప్యానెలింగ్‌కూడా చేయగలరు. ఆధునిక టెక్నాలజీని సమయానుకూలంగా వాడుకోవడంలో దిట్ట. వార్తాంశాల నిర్దారణలో, దాన్ని తెరపైకి త్వరగా తీసుకురావడంలో శ్రీహరి అత్యంత వేగంగా పనిచేస్తారని సన్నిహితులు చెప్తారు. పనిలో వేగం, అదే సమయంలో నాణ్యత, జట్టును సమన్వయంతో నడిపించడంలో సమర్థులని ఆయన మిత్రులు చెప్తుంటారు. సిబ్బందిలో విశ్వాసం, ఆత్మస్థైర్యం నింపి మంచి ఫలితాలు రాబట్టారని వారు వ్యాఖ్యానిస్తారు. పనిలో రాజీపడరని, అసైన్‌ మెంట్‌ను అనుకున్నదానికంటే ముందుగా పూర్తిచేస్తారని, అదే కెరీర్‌ పరంగా ఆయన్ని ముందుకు తీసుకెళ్లిందని వారు చెప్తుంటారు. ఇవన్నీ వై.యస్‌.జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు ఉపకరించాయని, జగన్‌ విశ్వాసాన్ని చూరగొన్నారని చెప్తుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories