ప్రజావేదిక కూల్చివేత పనులు దాదాపుగా పూర్తి అయినట్లే ..

ప్రజావేదిక కూల్చివేత పనులు దాదాపుగా పూర్తి అయినట్లే ..
x
Highlights

అనుకున్న విధంగానే ఉండవల్లిలోని ప్రజావేదిక భవనాన్ని కూల్చి వేసింది ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ల సదస్సు ముగియగానే ప్రజావేదికను కూల్చివేయాలంటూ సీఎం జగన్...

అనుకున్న విధంగానే ఉండవల్లిలోని ప్రజావేదిక భవనాన్ని కూల్చి వేసింది ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ల సదస్సు ముగియగానే ప్రజావేదికను కూల్చివేయాలంటూ సీఎం జగన్ ఆదేశాలతో కూల్చివేత పనులు మొదలు పెట్టారు అధికారులు. ప్రజావేదిక కూల్చివేత పనులు బుధవారం ప్రారంభిస్తామని సంకేతాలు పంపినా.. అనూహ్యంగా మంగళవారం సాయంత్రం నుంచే పనులు మొదలు పెట్టారు.

ఒక పక్క జిల్లా కలెక్టర్ల సదస్సు జరుగుతుండగానే... సాయంత్రంగం సీఆర్‌డీఏ అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది ప్రజావేదిక వద్దకు బయల్దేరి వెళ్లారు. కాసేపటికి 3, 4 ఆటోల్లో కూలీలు అక్కడికి చేరుకున్నారు. పూల కుండీలు, కుర్చీలు, కంప్యూటర్లు వంటి వస్తువుల్ని లారీల్లోకి ఎక్కించి వివిధ ప్రాంతాలకు తరలించారు. కొంత విద్యుత్ సామాగ్రి, ఫర్నిచర్‌, కంప్యూటర్లు సచివాలయానికి..

అమరావతిలో ఐఏఎస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు తరలించారు. ముందుగా కరకట్టను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయానికి పెద్ద సంఖ్యలో కూలీలు పలుగు, పారలతో రంగంలోకి దిగారు. మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లను తీసుకు వచ్చి కూల్చివేత పనుల్లో నిమగ్నం అయ్యారు. ముందుగా ప్రజావేదికలో ఏర్పాటు చేసిన టెంట్ ను కూల్చివేశారు. ఆ తర్వాత ప్యాంట్రీని నేలమట్టం చేసి.. ప్రహరి గోడను కూల్చివేశారు.

రాత్రి 11 గంటల సమయంలో ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు మొదలయ్యాయి. అర్దరాత్రి తర్వాత పనులు కొనసాగాయి. అర్ధరాత్రి సమయానికి భవనం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. ప్రధాన భవనం పక్కనే నిర్మించిన ప్యాంట్రీ, చిన్న డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లను తొలగించారు.

రాత్రి 12 గంటల సమయానికి కూడా ఫర్నిచరు, ఏసీలు, ఇతర పరికరాలు లారీల్లో తరలిస్తూనే..మరో వైపు కూల్చి వేత పనులు కొనసాగించారు. తెల్లవార్లు కూల్చివేతలు చేపట్టారు.

అక్రమ కట్టడం ప్రజా వేదిక కూల్చివేత పనులు రెండవరోజు కొనసాగుతున్నాయి...నిన్న కలెక్టర్ల సదస్సు ముగియగానే ప్రారంభమైన కూల్చివేత రాత్రంతా కొనసాగింది. ఇవాళ ఉదయం వర్షం కురుస్తుండడంతో కాస్త అంతరాయం కలిగినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ కూల్చివేత పనులు చేపట్టారు. మరోవైపు ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భవనాన్ని కూల్చి వేస్తున్నారని తెలిసి రాజధానికి చెందిన కొందరు రైతులు,, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని పంపించి వేశారు.

మీడియా ప్రతినిధుల్ని లోపలికి అనుమతించకుండా కూల్చివేత ప్రక్రియ కొనసాగించారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 70 మంది సివిల్‌, మరో 70 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతను సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories