గ్రామ, వార్డు సచివాలయ సేవలు వాయిదా.. కారణం ఏంటంటే..

గ్రామ, వార్డు సచివాలయ సేవలు వాయిదా.. కారణం ఏంటంటే..
x
YS Jagan Mohan Reddy
Highlights

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సేవలు వాయిదా పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సేవలు వాయిదా పడ్డాయి. నేడు (జనవరి 1)ప్రారంభం కావాల్సిన వార్డు, గ్రామ సచివాలయ సేవలను తాత్కాలికంగా వాయిదా వెయ్యాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి లేదంటే వచ్చే నెల 1 నుంచి ఈ వ్యవస్థను ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇంకా పూర్తి కాలేదు. భారీ సంఖ్యలో సదుపాయాలు అవసరం కావడంతో కాంట్రాక్టర్లు వీటిని పూర్తి స్థాయిలో సమీకరించలేదు. దానికి తోడు ఉద్యోగాల్లో చేరిన కొందరు అప్పుడే వదులుకున్నారు. దాంతో వార్డు, గ్రామ సచివాలయ సేవలు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగం చేరిన, ఇంకా భర్తీ కాని పోస్టులతో కలిపితే 30 వేల పైచిలుకు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంక్రాంతి తరువాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాగా గ్రామాల నుంచే పరిపాలన సాగాలన్న ఎన్నో ఏళ్ల డిమాండ్ ఏపీలో నెరవేరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సచివాలయ వ్యవస్థ ఆధారంగా 500 రకాల ప్రభుత్వ సేవలను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇంటి పట్టా, జనన మరణ, నివాస, క్యాస్ట్ ధ్రువపత్రాలు వంటి వాటికి కోసం పేదల ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఇక మాయం కానుంది. సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలకు జరగకుండా పారదర్శకంగా అర్హులకే వాటిని అందించడానికి గాను ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాను అందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ఉంచుతారు.

ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలను మూడు విభాగాలుగా అధికారులు వర్గీకరించారు. వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను కేవలం15 నిమిషాల్లో అందించేలాగ ఒక విభాగం, 148 రకాల సేవల( పింఛన్, రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు)ను దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అందించేలోగా మరో విభాగం, 311 రకాల సేవలను 72 గంటల కంటే ఎక్కువ సమయంలో అందించేలా మరో విభాగాన్ని ఈ వ్యవస్థలో ఏర్పాటు చేశారు.

దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందించేవి (వ్యవసాయం 8, పశుసంవర్ధక 6, పౌరసరఫరాలు 1, హోమ్ శాఖ 6, మున్సిపల్ శాఖ 8 , పంచాయితి రాజ్ 6,రెవెన్యూ 2, సంక్షేమ శాఖలు 10) శాఖలు ఉన్నాయి. ఇక 72 గంటల్లోగా అందించేవి(వ్యవసాయం 26, పశుసంవర్ధక 1, గృహ నిర్మాణ 1, పౌరసరఫరాలు 8, విద్యుత్ 12, హోమ్ శాఖ 8, కార్మిక, ఉపాధి శిక్షన 9, మున్సిపల్ శాఖ 15, పంచాయితి రాజ్ 6, స్టాంపులు రిజిస్ట్రేషన్ 2, రెవెన్యూ 16, సంక్షేమ శాఖలు 25) శాఖలు ఉన్నాయి. 72 గంటలు దాటిన తరువాత అందించే సేవలు(వ్యవసాయం 26, పశుసంవర్ధక 5, గృహ నిర్మాణ 1, పౌరసరఫరాలు 2, విద్యుత్ 101, హోమ్ శాఖ 53, కార్మిక, ఉపాధి శిక్షన 8, మున్సిపల్ శాఖ 24, పంచాయితి రాజ్ 19, స్టాంపులు రిజిస్ట్రేషన్ 2, రెవెన్యూ 45, సంక్షేమ శాఖలు 27) శాఖలుగా ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories