Police Alert: ఆలయాలపై దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన విశాఖ పోలీసులు

Representational Image
Police Alert: విజయనగరం జిల్లా రామతీర్ధంలో జరిగిన రాముని విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది....
Police Alert: విజయనగరం జిల్లా రామతీర్ధంలో జరిగిన రాముని విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో విశాఖలో భద్రతకు పెద్ద పీట వేస్తూ అన్ని దేవాలయాల్లో సిసీ కేమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు.
రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లాలో కూడా అత్యంత చారిత్రాత్మకమైన ఆలయాలున్నాయి. సింహచలంతో పాటుగా బురుజుపేట కనకమహలక్ష్మీ ఆలయం, ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం ఇలా విశిష్టత కలిగిన ఆలయాలు విశాఖ జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రశాంతతకు మారు పేరైన విశాఖలో అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించారు.
విశాఖలో ఎవరైనా మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా, ప్రార్థనా మందిరాలపై దాడులు చేసినా, విగ్రహాల స్వరూపం మార్చేందుకు యత్నించినా కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో చిన్నా, పెద్దా ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలు, వాటి కమిటీల వివరాలను సేకరించాలని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులను ఆదేశించారు.