అనుకున్నది సాధించిన వైసీపీ ప్రభుత్వం.. కానీ ప్రమాదం పొంచి ఉందా!

అనుకున్నది సాధించిన వైసీపీ ప్రభుత్వం.. కానీ ప్రమాదం పొంచి ఉందా!
x
Highlights

పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఆగిపోతుందో అన్న అపోహ తొలగిపోయింది.

పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఆగిపోతుందో అన్న అపోహ ఇప్పుడు తొలగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన పోలవరం ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టు మరియు దాని అనుబంధ జల విద్యుత్ ప్రాజెక్టు పనులు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటిరోజే పనులను ప్రారంభింపజేసింది.

4987 కోట్ల రూపాయల ప్రారంభ బెంచ్ మార్క్ కంటే దాదాపు 800 కోట్ల రూపాయలు తక్కువ కోట్ చేయడం ద్వారా మిగిలిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి కాంట్రాక్టును పొందింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ, ఈ ప్రాజెక్టుకు శుక్రవారం భూమి పూజలు చేయడం ద్వారా అధికారికంగా పనులను ప్రారంభించినట్టయింది.

ప్రాజెక్ట్ పనులను చేపట్టడానికి మేఘా సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పటికీ, జూన్ 2021 గడువులోగా పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.. ఇది అత్యంత కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ మేఘా సంస్థ గతంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసింది. అయితే పోలవరంలో ఏ కారణం చేతనైనా పనులు అనుకున్న వ్యవధిలోగా పూర్తిచెయ్యకపోతే మాత్రం.. రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు పూర్తిగా వ్యవసాయ సీజన్‌ను కోల్పోతారని.. దానివలన కోట్లాది రూపాయలు నష్టపోవచ్చని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.

ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకుంటున్న పొదుపులు ఈ నష్టాలతో తుడిచి పెట్టుకుపోతాయని అంటున్నారు. అంతేకాదు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఇపిసి) ప్రాతిపదికన మేఘా సంస్థ కాంట్రాక్టును పొందింది.. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టును అంచనా వేసిన బడ్జెట్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం అయితే ఖర్చు కూడా పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. అందువల్ల భవిశ్యత్ లో ఖర్చు పెరగకుండా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు పోలవరంలో కొంతకాలం అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా నెలలుగా వేతనాలు పొందలేని కార్మికులు పోలవరం ప్రాజెక్ట్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. వాస్తవానికి గతంలో పోలవరం నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థ ఈ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అయితే ఆ సంస్థ బకాయిలను చెల్లించని కారణంగా కొంతమంది కార్మికులు ఇబ్బందుల్లో పడ్డారు.

ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న సమయంలోనే పూర్తి చేసి చూపిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ప్రగల్భాలు పలికిందని, అయితే 2014 మరియు 2017 మధ్య ఏమీ చేయలేదని, గత రెండేళ్లలో మాత్రమే స్పిల్‌వేను కొంతభాగం నిర్మించి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేశానని టీడీపీ అబద్ధాలు చెబుతోందని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories