Polavaram Project works: వరదలోనూ ముమ్మరంగా పోలవరం పనులు!

Polavaram Project works: వరదలోనూ ముమ్మరంగా పోలవరం పనులు!
x

Polavaram project works

Highlights

Polavaram project works: జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంబంధించిన పనులు వరదల సమయంలోనూ వేగంగా జరుగుతున్నాయి

ఒక పక్క వరద, సమీప గ్రామాల్లోని జనం ఇంకా తేరుకోని పరిస్థితి. అయినాజాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంబంధించి పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే సకాలంలో పనులు పూర్తిచేసి వీలైనంత తొందర్లో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా అధికారులు సైతం ఎన్ని అడ్డంకులు వచ్చినా అధికమించి, నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గోదావరి వరద ఉధృతితో పోటీపడుతూ ప్రాజెక్టు పనులు 'మెగా' స్పీడ్‌తో జరుగుతున్నాయి. స్పిల్‌ వే బ్రిడ్జితోపాటు ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌3లో కాంక్రీట్‌ డ్యామ్‌ పునాది పనులు.. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌1లో డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు.. జలవిద్యుత్కేంద్రం, స్పిల్‌ చానల్‌లో మట్టి పనులు.. స్పిల్‌ వేకు గేట్లను బిగించేందుకు 'ట్రూనియన్‌ బీమ్‌' పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద ఈనెల 12 నుంచి 20వతేదీ వరకూ అతి భారీ వర్షం కురవడంతో తొమ్మిది రోజులు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గడంతో 21న పనులు పునఃప్రారంభం కాగా అదేరోజు పోలవరం ప్రాజెక్టు వద్దకు 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంత ఉధృతిలోనూ మొదలైన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

► పోలవరం స్పిల్‌ వే గేట్లు బిగించే పనులు అక్టోబర్‌లో ప్రారంభించి ఏప్రిల్‌కు పూర్తి చేయనున్నారు.

► 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కాంట్రాక్టు సంస్థ ఎంఈఐఎల్‌(మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌), జలవనరులశాఖ అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. ప్రణాళిక అమలు తీరును జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

► వరద ఉధృతిలోనూ స్పిల్‌ వేకు గేట్లు బిగించడానికి ట్రూనియన్‌ బీమ్‌ పనులు చేస్తున్నారు.

► స్పిల్‌ చానల్‌ 902 హిల్‌లోనూ, జలవిద్యుత్కేంద్రం పునాదిలోనూ రోజూ 20 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేస్తున్నారు. డిసెంబర్‌కు జలవిద్యుత్కేంద్రం పునాది పూర్తవుతుంది. ఆ తర్వాత 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులు చేపడతారు.

► ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌3లో కాంక్రీట్‌ డ్యామ్‌ పునాది కోసం మట్టి తవ్వకం పనులు చేస్తున్నారు.

► పోలవరం జలాశయానికి కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్‌ పనుల్లో కుడివైపు పనులు పూర్తయ్యాయి. ఎడమవైపు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పూర్తి..

పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ చివరకు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణ అమలు చేస్తున్నాం. లాక్‌డౌన్‌లోనూ పనులు చేశాం. గోదావరి వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం ఫలాలను రైతులకు అందిస్తాం.

– ఆదిత్యనాథ్‌ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ.

Show Full Article
Print Article
Next Story
More Stories