Polavaram: ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్న పోలవరం

Polavaram Project in Andhra Pradesh | AP News
x

Polavaram: ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్న పోలవరం

Highlights

Polavaram: డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న పాపం ఎవరిదంటూ ప్రశ‌్నలు

Polavaram: పోలవరం ప్రాజెక్ట్ రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న పాపం మీదంటే మీదంటూ అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు ప్రాజెక్ట్ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చాయి. డయాఫ్రమ్ వాల్ పాపం ఎవరిదంటూ ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఈ తప్పిదం ప్రకృతి ప్రకోపానిదో లేక నిర్మాణ లోపానిదో తెలీదు కాని కోట్లాది రూపాయిలు గంగపాలైన వైనంపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్.

ఆఖండ గోదావరి నదిపై రూపుద్దిద్దుకుంటోన్న పోలవరం ప్రాజెక్ట్ రాజకీయాలకు వేదికగా మారింది. గత ఏడాది చివరి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని అప్పట్లో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటన చేసారు. తాజాగా ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి అంబటి మాత్రం పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేమన్న వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. అసలు ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణలేంటని ప్రశ్నిస్తున్నారు.

అయితే 2019-2020లో ఎవరూ ఊహించని విధంగా వరద గోదావరికి పోటెత్తింది. ఈ వరద డయాఫ్రమ్ వాల్ నుంచి సెకనుకు మూడు మీటర్లు ప్రవహిస్తుందని భావించినా సెకనుకు 13 మీటర్ల వరద తాకిడి డయాఫ్రమ్ వాల్‌ను దాటుకుంటూ వెళ్లింది. దీంతో వాల్ కింది భాగంలో కోత ఏర్పడి డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది. వారం రోజుల క్రితం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను నిపుణుల కమిటీ పరిశీలించింది. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టాలా లేక మరమత్తులు చేస్తే సరిపోతుందా అనే అంశాలను పరిశీలించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు కమిటీ సభ్యులు.

అయితే తాము అధికారంలో ఉండి ఉంటే నష్టం జరిగేది కాదనేది టీడీపీ వాదనైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం స్పిల్ వే ఛానల్ నిర్మాణంపై దృష్టి సారించకపోవడమే డయాప్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమన్నది వైసీపీ ప్రభుత్వ వాదన. మంత్రుల అవగాహనా లోపంతో నేడు జాతీయ స్థాయి ప్రాజెక్ట్ అపహాస్యం అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.

జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్‌ను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందని వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పోలవరాన్ని టీడీపీ ఏటిఎంలా వాడుకుందని నేరుగా బిజేపి పెద్దలే వ్యాఖ్యనించారని గుర్తు చేస్తూ రివర్స్ టెండరింగ్ కి వెళ్లడంతోనే ప్రాజెక్ట్‌లో లోపాలు బయటపడ్డాయని అంటున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవలు జరిగాయని.. వాటి కారణంగానే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని వైసీపీ నిరూపించగలిగితే టీడీపీతో పాటు కేంద్రంలోని బిజెపి కూడా దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందని వామపక్షాలంటున్నారు. దీంతోనే మూడు పార్టీలు ప్రజల ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలను చూసుకుంటున్నాయని మండిపడుతున్నారు.

మరోపక్క జాతీయ ప్రాజెక్ట్ కోసం తమ సర్వశ్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితులను నట్టేట ముంచేస్తున్నారన్న వాదన వినిసిస్తోంది. ఇప్పటి వరకు నిర్వాసితుల్లో 4 శాతం మందికి మాత్రమే పరిహారం.. పునరావాసం కల్పించినట్టు నివేదికలు చెప్తున్నాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినకపోతే ముందుగా ప్రకటించిన ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదని వైసీపీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంటే తాజాగా ఎత్తు తగ్గించేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తే మాత్రం పోలవరం ముంపు మండలాల నిర్వాసితులు సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories