పోలవరం: గత ఖర్చులకు జగన్ ప్రభుత్వమే లెక్కలు చెప్పాలా?

పోలవరం: గత ఖర్చులకు జగన్ ప్రభుత్వమే లెక్కలు చెప్పాలా?
x
Highlights

పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్ర ప్రభుత్వ వైఖరి జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. 2014 ముందు చేసిన ఖర్చులకు సంబంధించి లెక్కలు చూపితేనే కానీ పోలవరం పనుల కోసం సొమ్ములు వెచ్చించేది లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులకు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టిసారించింది. పోలవరం ప్రధాన ప్రాజెక్టు, జల విద్యుత్ ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులకు ఇటీవల రివర్స్ టెండరింగ్ అమలు చేసి దాదాపు 800 కోట్ల రూపాయలు ఆదా చేసినప్పటికీ.. కేంద్రం నుండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం కనీసం 16,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని, అలాగే 2014 కి ముందు వివిధ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లను తిరిగి చెల్లించాలని సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ 5వేల కోట్లను చెల్లించలేమని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర నీటిపారుదల శాఖ రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది, ఈ ప్రాజెక్టుకు 2014 కి ముందు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఖాతా సమర్పించాల్సి ఉంటుందని.. అప్పుడే ఆలోచిస్తామని పేర్కొన్నారు.

వాస్తవానికి 2014 రాష్ట్రం విభజనకు ముందు పోలవరం నిర్మాణం కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అంతకుముందు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా లేనందువలన ఈ ఖర్చు రాష్ట్రమే భరించింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకమైన పోలవరం కుడి, ఎడమ కాలువల తవ్వకం 90 శాతం పూర్తి చేశారు. అలాగే కొంతమంది నిర్వాసితులకు చెల్లింపులు కూడా చేశారు. ఆ తరువాత ప్రాజెక్టు నిర్మాణం నత్తనడక సాగింది. అయితే ఈ ఖర్చుకు రాష్ట్రం యుటిలిజషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన ఖాతాలను సమర్పించాలి. అయితే ఈ తతంగం పూర్తయితేనే పెండింగ్ నిధులు విడుదల చేస్తామని కేంద్రం రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు గత ప్రభుత్వం హయాంలో పెద్ద మొత్తంలో నిధులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి కాంట్రాక్టర్లకు జరగని పనులకు కూడా డబ్బు చెల్లించారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మాత్రం నిధుల మళ్లింపు ఆధారాలు లేవని అంటోంది.

ఇదిలావుంటే ఇకపై ఈ ప్రాజెక్టు పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కేంద్రం కోరుకుంటుంది. అందులో భాగంగా ప్రాజెక్టు పనులపై అధికారులు దృష్టిసారించేందుకు వీలుగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ) ను హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం లేదా కొవ్వూరుకు మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్ 21 న జరగనున్న పిపిఎ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories