గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ

గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ
x
Highlights

గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం. రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తాడేపల్లి: గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం. రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘2025–26లో రాష్ట్రంలో దాదాపు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది కేవలం వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే పంట. ఏటా ఒకసారి మాత్రమే సాగవుతుంది. కంది కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటా రూ.8 వేలు కాగా, ఇప్పుడు రైతులు క్వింటా కంది రూ.6500 నుంచి రూ.6600కే అమ్ముకుంటున్నారు. అదే పక్కన కర్ణాటకలో ప్రభుత్వం స్వయంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, క్వింటా కంది రూ.8 వేలకు కొంటున్నట్లు చెబుతున్నారు. ఏ పంట అయినా మార్కెట్‌కు వచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిస్తే రైతులు వ్యాపారుల బారినపడి నష్టపోరు.’’ అని నాగిరెడ్డి వివరించారు.

ఆ ఆలోచనే లేని ప్రభుత్వం

రాష్ట్రంలో కంది ప్రధానంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సాగు చేశారు. గత ఏడాది పంట ఉత్పత్తి 171 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది అంచనా 117 లక్షల టన్నులు. అలాగే గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 473 కిలోలు కాగా, ఈ ఏడాది అది కూడా 401 కిలోలకు తగ్గింది. అలా గత ఏడాది కంటే ఈసారి పంట ఉత్పత్తి, సగటు దిగుబడి రెండూ తగ్గాయని నాగిరెడ్డి తెలిపారు.

మొక్కజొన్న రైతుల దుస్థితి:

మొక్క జొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) క్వింటా రూ.2400 కాగా, రైతులు క్వింటా మొక్కజొన్న రూ.1500 నుంచి రూ.1900 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పంటను రాష్ట్రంలో ఈ సీజన్‌లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, అదీ సగటు దిగుబడి తగ్గింది. పొరుగున తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి, ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలుపెట్టగా, మన ప్రభుత్వానికి మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో వచ్చిన కాడికి రైతులు తక్కువ ధరకు పంట అమ్ముకుంటున్నారు. కంది మాదిరిగా మొక్కజొన్న సగటు దిగుబడి గత ఏడాది కంటే బాగా తగ్గుతుందని అంచనా. మొక్కజొన్న గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 4,710 కిలోలు కాగా, ఈ ఏడాది 4,254 కిలోలు మాత్రమే అని అంచనా వేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవంగా చూస్తే, అది ఇంకా తగ్గే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.

కష్టాల్లో రైతాంగం:

కేవలం కంది, మొక్కజొన్న మాత్రమే కాదు, అనేక పంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అనావృష్టి లేక అధిక వర్షాలకు సాగు తగ్గి, దిగుబడి తగ్గి, అమ్మకం ధరలు పడిపోయాయి. ఎమ్మెస్పీకి ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయకపోవడం, ఉచిత పంటల భీమా పథకం రద్దు, సున్నా వడ్డీ పంట రుణాలు అమలు చేయకపోవడం, చివరకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవలోనూ మోసం.. ఇవన్నీ వెరసి రైతులను తీవ్ర నష్టాల పాల్జేసి, వారిని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ప్రభుత్వ పెద్దలూ.. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. ‘రైతు కంట కన్నీరు మంచిది కాదు. అది అరిష్టం’ అని నాగిరెడ్డి హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories