AP News: ఏపీలో వైసీపీని ఎదుర్కొనేందుకు పవన్, లోకేష్ నిర్ణయం

Pawan Kalyan And Lokesh Decision To Face YCP In AP
x

AP News: ఏపీలో వైసీపీని ఎదుర్కొనేందుకు పవన్, లోకేష్ నిర్ణయం

Highlights

AP News: మూడు గంటల పాటు కొనసాగిన సమావేశం

AP News: ఏపీలో వైసీపీని ఉమ్మడిగా ఎదుర్కొంటూ... రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో భేటీ అయింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు ఇరు పార్టీలకు చెందిన కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ భేటీలో మొత్తం ఆరు అంశాలపై చర్చ జరిగింది. ఇందులో ఉమ్మడి మ్యానిఫెస్టో ఇవ్వాలా...? లేక... కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకటించాలా..? అనే దాని మీద కూడా ఇరువురు చర్చించారు... దాదాపు మూడు గంటలపాటు సాగిన టీడీపీ-జనసేన ఈ భేటీ కొనసాగింది.

రాష్ట్రంలో తమ ఇరు పార్టీలపై వైసీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని భేటీలో పవన్ కళ్యాణ్ వైసీపీని దుయ్యబట్టారు... 2014లో తాను టీడీపీకి మద్దతిచ్చానని.. రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలన్న లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని పవన్ గుర్తు చేశారు. వైసీపీకి, జగన్‌కు తాను వ్యతిరేకం కాదని, వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకమని కమిటీ సభ్యులకు వివరించి చెప్పారు.. రాష్ట్రానికి ప్రస్తుతం వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు. సీఎం జగన్ మద్యపాన నిషేధంపై కానీ, ఉద్యోగుల సీపీఎస్‌పై కానీ మాట నిలబెట్టుకోలేదని దీన్ని ప్రజల్లో్కి తీసుకెళ్లాలని పవన్ సూచించారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఉండి కూడా ఇప్పుడు ఏపీ ప్రజల కోసం చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఇకపై టీడీపీ - జనసేన ఉమ్మడిగా ఉద్యమాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్ధితుల్లోనూ చీలకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని, దీనికి వ్యతిరేకంగా క్షేత్రస్ధాయిలో ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. రానున్న వంద రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కీలక భేటీలో చర్చించారు. 29, 30, 31తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ, జనసేన నాయకులతో ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. నవంబర్ 1వ తేదీ నుంచి మ్యానిఫెస్టో రూపొందించుకుని... 100 రోజుల్లో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టేలా ప్రణాళిక రూపొందించారు.

కరువు నేపథ్యంలో రైతులు నష్టపోతున్నందున... ఇరు పార్టీల నేతలు క్షేత్రస్ధాయిలో పర్యటించి జేఏసీకి నివేదిక ఇవ్వాలని నిర్ణింయించారు... ఈ భేటీలో మూడు తీర్మానాలు ఆమోదించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఓ తీర్మానం... అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకు పొత్తు పెట్టుకోవాలని మరో తీర్మానం.. అన్నివర్గాల ప్రజలను అభివృద్ధి చేసేలా ఇంకో ముఖ్యమైన తీర్మానాన్ని ఆమోదించారు. ఇదో చారిత్రక కలయిక అని, రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల ముందు ఎండగట్టడమే తమ ముందున్న లక్ష్యమని ఇరు పార్టీల నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో... 2024లో ఇరు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఇద్దరూ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ ఏపీకి మంచి రోజులు తెస్తామని పవన్ కళ్యాణ్, లోకేష్ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories