కళ్లముందే కన్నబిడ్డ నరకయాతన.. మరణం ప్రసాదించండి : తల్లిదండ్రలు

కళ్లముందే కన్నబిడ్డ నరకయాతన.. మరణం ప్రసాదించండి : తల్లిదండ్రలు
x
Highlights

కళ్లముందే కన్నబిడ్డ నరకయాతన.. మరణం ప్రసాదించండి : తల్లిదండ్రలు కళ్లముందే కన్నబిడ్డ నరకయాతన.. మరణం ప్రసాదించండి : తల్లిదండ్రలు

ఏడాది వయసున్న తమ కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలని తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట మండలం బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బావాజాన్, షబానా దంపతులు కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడదు. సొంతిల్లు కూడా లేని దుస్థితి వారిది. ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మొదట్లో ఇద్దరు పిల్లలు పుట్టి రోజుల వ్యవధిలోనే సుగర్‌ స్థాయి పడిపోవడంతో ఆ ఇద్దరూ చనిపోయారు. మూడో సంతానంగా రెడ్డి సుహానా (1) జన్మించింది. పాపకు ఏడాది వయసు వచ్చినా ఎదుగుదల లేదు. దీంతో డాక్టర్లకు చూపిస్తే.. ఆ చిన్నారికి సుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని.. అందువల్లే ఎదుగుదల లేదని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలో పాప వైద్యం కోసం అన్ని చోట్ల అప్పులు చేశారు. కూలి పనుల ద్వార వచ్చిన డబ్బంతా వైద్యానికే ఖర్చు అయ్యేది.

పాపకు రోజుకు 4 ఇంజక్షన్లు చేయించాలి. ఒక్కో సూది మందు రూ. 600. ఇలా రోజుకు రూ. 2,400 ఖర్చు చేయించారు.. అయినా వ్యాధి నయం కావడం లేదు. తినడానికే తిండి లేని వారికి ఇకపై పాపకు వైద్యం చేయించడం కష్టమైంది. కళ్ల ముందే కన్నబిడ్డ నరకయాతన చూస్తూ ఉండలేక పోతున్నారు. గుండెల్లో బాధను దిగమింగుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చారు. బిడ్డను చూస్తూ బతకలేమని, తమ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తల్లిదండ్రులు సెకండ్‌ జేయంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించారు. అయితే తాము కారుణ్య మరణానికి అనుమతించలేమని, జిల్లా జడ్జిని ఆశ్రయించాలని సలహా ఇవ్వడంతో వారు ఆయన వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు తమ మీద పగబట్టారని.. పుట్టిన ప్రతి బిడ్డా తమకు దక్కకుండా పోతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories