ఏపీలో మరో ఎన్నికల సమరం.. మూణ్నెళ్లే గడువు

ఏపీలో మరో ఎన్నికల సమరం.. మూణ్నెళ్లే గడువు
x
Highlights

ఏపీలో మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోన్నాయి రాజకీయ పార్టీలు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో మూడు నెలల్లో జరిపే అవకాశం...

ఏపీలో మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోన్నాయి రాజకీయ పార్టీలు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో మూడు నెలల్లో జరిపే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే కోలుకోలేని స్థితిలో ఉన్న పార్టీలు మళ్ళీ ప్రజాతీర్పును కోరనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం జవాబిచ్చింది. మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు నివేదించారు..

మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధిత ఉన్నతాధికారి ద్వారా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. దీంతో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు..

ఇదిలావుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ ఇదివరకే ప్రకటించారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్లపై రాజ్యంగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా పాలపరమైన నిర్ణయాలు కొన్ని పెండింగులో ఉన్నాయి. దానికి తోడు పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది రాష్ట్రప్రభుత్వం. ఈ క్రమంలో అధికార యంత్రాంగం దీనిపైనే దృష్టిసారించింది. దాంతో ప్రక్రియ ఆలస్యమవుతోన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మూడు నెలల్లో అన్ని ఇబ్బందులను అధిగమించి స్థానిక పోరులోనూ సత్తాచాటాలని వైసీపీ భావిస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో ఇసుక కొరత.. అమరావతి రాజధానిపై అస్పష్టత వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ భావిస్తోంది. ఈ సమయంలో ఎన్నికలు వస్తే ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తుంటే.. జనసేన మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories