Nallamala: నల్లమలలో వలస పక్షుల సందడి

Nallamala: నల్లమలలో వలస పక్షుల సందడి
x

Nallamala: నల్లమలలో వలస పక్షుల సందడి

Highlights

నల్లమలలో వలస పక్షుల సందడి పక్షుల కిలకిలరావాలతో సంతరించకున్న శోభ శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో..

ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణి అభిమానులకు ఇదొక అద్భుతమైన శుభవార్త! జీవవైవిధ్యానికి చిరునామా, పచ్చని అందాలకు నీలువైన నల్లమల అడవి... ప్రస్తుతం పక్షుల కిలకిలరావాలతో కొత్త శోభను సంతరించుకుంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో, కార్తీక మాసం ఆరంభంతో... సుదూర దేశాల నుంచి అతిథులు నల్లమలకు క్యూ కడుతున్నారు. ఇవి మామూలు అతిథులు కాదు... ప్రపంచంలోనే అత్యంత అరుదైన..అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వలస పక్షులు!. ముఖ్యంగా, "పెయింటెడ్ స్ట్రోక్"గా పిలవబడే ఆ అద్భుతమైన పక్షుల సమూహం... నల్లమల అందాన్ని, కృష్ణా నది తీరాన్ని తమ పునరుత్పత్తి కేంద్రంగా ఎంచుకున్నాయి.

ఇవి కేవలం పక్షులు కాదు... సజీవ చిత్రాలు! ప్రఖ్యాత చిత్రకారుడు తన కుంచెతో గులాబీ, నలుపు, బూడిద, పసుపు రంగులను రంగరించి సునాయాసంగా గీశాడా అనిపించేలా ఉంటాయి ఈ పక్షులు. అందుకే శాస్త్రవేత్తలు వీటికి 'పెయింటెడ్ స్ట్రోక్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నల్లమల అభయారణ్య పరిసరాల్లో... ఈ అరుదైన అతిథుల సందడి మొదలైంది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కొంగ జాతిలోకెల్లా అతి పెద్దదిగా పేరొందిన ఈ పెయింటెడ్ స్ట్రోక్ పక్షులు... ఈసారి వేల సంఖ్యలో వలస వచ్చాయి.

రష్యా, సైబీరియా, హిమాలయాల ఉత్తర-దక్షిణ ప్రాంతాల నుంచి వేలాది మైళ్లు ప్రయాణించి ఈ పక్షులు భారత ఉపఖండంలో అడుగుపెట్టాయి. ఈ ఏడాది అధిక వర్షాలు నల్లమలలోని నీటి వనరులను నింపడంతో... ఇక్కడి వాతావరణం వీటికి మరింత అనుకూలంగా మారింది. సుమారు మూడు అడుగుల ఎత్తు, మూడున్నర కిలోల బరువు ఉండే ఈ పక్షులు... కృష్ణా నది తీరం, సంగమేశ్వర క్షేత్రం, వేలుగోడు జలాశయం, భావనాసి నదీ తీరం, సిద్దాపురం చెరువు ప్రాంతాలను తమ నివాసాలుగా మార్చుకున్నాయి.

రాబోయే నాలుగు నెలలు, అంటే మార్చి వరకు, ఈ పక్షులు మనకు అతిథులుగా ఇక్కడే ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ తుమ్మ చెట్లను ఎంచుకుని గూళ్లు కట్టుకొని..సంతానోత్పత్తి జరుపుతాయి. నదీ తీరాల్లో చేపలు, నీటి కీటకాలు, నాచును ఆహారంగా తీసుకుని... పిల్లలు రెక్కలు వచ్చాక మార్చి మాసంలో తమ సొంత ప్రాంతాలకు వెనుతిరుగుతాయి. పెయింటెడ్ స్ట్రోక్ తో పాటు... నీటికాకులు, గూడబాతులు, పెలికాన్స్, సముద్ర పక్షులు మరియు ఫ్లెమింగోస్ కూడా ఈ వలస పక్షుల పండుగలో భాగమయ్యాయి. అంతరించిపోయే జాబితాలో ఉన్న ఈ వలస పక్షులకు నల్లమలలోని ఆత్మకూరు పెద్దపులుల అభయారణ్యం ప్రాంతం... అత్యంత ముఖ్యమైన పక్షుల ప్రాంతంగా మారింది. దీంతో నాగార్జున సాగర్-శ్రీశైలం అభయారణ్యం అధికారులు కేంద్రానికి నివేదికలు పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories