విద్యా ప్రమాణాల మెరుగుకు ‘మన బడి - మన బాధ్యత’

విద్యా ప్రమాణాల మెరుగుకు ‘మన బడి - మన బాధ్యత’
x
Highlights

పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుకు గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది.

గుంటూరు : పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుకు గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం తద్వారా పది పరీక్షలలో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా "మన బడి - మన బాధ్యత" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో గల 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి, ఆయా పాఠశాలల పర్యవేక్షణ చేయుటకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు.

తొమ్మిది, పది విద్యార్థుల్లో మానసిక ఆందోళన తగ్గించడం, చదువు పట్ల ఏకాగ్రత కలిగించడం, విద్యార్థులు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గుర్తించి వాటిలో మంచి తర్ఫీదు ఇవ్వడం, అందులో ఉన్న భయం పోగొట్టడం, అదే సబ్జెక్టులో ఉన్నత విద్య అభ్యసించి అందులో నిపుణులుగా తయారు అయ్యే విధంగా మలచడం వంటి అంశాలు పట్ల దృష్టి సారించారు. విద్యార్థులకు ప్రత్యేక అధికారులు మార్గదర్శిగా, కౌన్సిలింగ్ అందించడం చేస్తారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వ్యక్తుల జీవిత చరిత్రలు తెలియజేస్తూ ప్రేరణ కలిగించడం జరుగుతుంది.

జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, విద్యార్థులు సరైన అవగాహన లేక అనేక అవకాశాలు చేజార్చుకుంటున్నారన్నారు. విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం, సూచనలు, సలహాలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు అందించడం వలన భవిష్యత్తుకు గట్టి పునాది పడుతుందన్నారు. అందుకే "మన బడి - మన బాధ్యత" కార్యక్రమాన్ని అమలు చేస్తూ జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని అన్నారు. అధికారులు స్వీయ అనుభవాలు కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచడం, మానసిక స్థైర్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories