logo

మరోసారి శ్రీశైలం జలాశయానికి భారీ వరద

మరోసారి శ్రీశైలం జలాశయానికి భారీ వరద
Highlights

పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సోమవారం ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల చేసిన వరద మంగళవారం శ్రీశైలానికి చేరింది.

పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సోమవారం ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల చేసిన వరద మంగళవారం శ్రీశైలానికి చేరింది.ఇందులో ఆల్మట్టి నుంచి 2.50 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి 2.57 లక్షల క్యూసెక్కులు వచ్చాయి. జూరాలకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో 25 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు చేరింది. మంగళవారం సాయంత్రానికి 3.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో.. ఒక గేటును ఎత్తి 50 వేల క్యూసెక్కులను సాగర్ కు విడుదల చేశారు. ఆ తరువాత మరో రెండు గేట్లను ఎత్తి నీటిని పెంచారు. ఇటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా 6,458 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతొ దిగువన ఉన్న నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పడమటి కనుమల తోపాటు తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బుధవారం నుంచి భారీ వరద వచ్చే అవకాశం ఉందని సిద్ధంగా ఉండాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) రాష్ట్రా ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేస్తుంది.


లైవ్ టీవి


Share it
Top