ఏపీలో పది జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించిన 'నివర్' తుపాను!

Banana garden collapsed in Andhra Pradesh with effect of Nivar cyclone
x

Nivar cyclone effect

Highlights

నివర్ తుపాను ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని కుదేలు చేసేసింది. రాష్ట్రంలోని పది జిల్లాలు నివర్ తుపాను తాకిడికి అతలాకుతలం అయిపోయాయి.

నివర్ తుపాను ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని కుదేలు చేసేసింది. రాష్ట్రంలోని పది జిల్లాలు నివర్ తుపాను తాకిడికి అతలాకుతలం అయిపోయాయి. తుపాను ప్రభావంతో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ఆయా జిల్లాల్లో పంటలు నీట మునిగి పోయాయి. అంతేకాకుండా వానలతో పట్టిన ముసురుకు చలిగాలి వణికించేసింది. ఒక అంచనా ప్రకారం చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలు తీవ్రంగా ఈ నివర్ తుపానుకు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇక కృష్ణా, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై కూడా భారీ ప్రభావాన్ని చూపించింది నివర్.

నివర్ తుపాను నష్టం వాటిల్లింది ఇలా..

* చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 126 మండలాకు గాను..105 మండలాల్లోని 973 గ్రామాల్ని జలమయం చేసింది. ఆ ప్రాంతాల్లో 1,400 కి.మీ పైగా రహదారులు దెబ్బతిన్నాయి.

* చిత్తూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 14, కడప జిల్లాలో ఒకచోట చిన్ననీటి వనరులు దెబ్బతిన్నాయి.

* పురపాలకశాఖ పరిధిలో చిత్తూరు జిల్లాలో 10 కి.మీ మేర రహదారులు, 12 కి.మీ మురుగుకాల్వలు, 4.4 కి.మీ తాగునీటి సరఫరా గొట్టపు మార్గాలు, 400 వీధి దీపాలు ధ్వంసమయ్యాయి.

* 3 చోట్ల పురపాలక పాఠశాలలు, సామాజిక భవనాలు దెబ్బతిన్నాయి.

* నెల్లూరు జిల్లాలో 6.05 కి.మీ రహదారులు, 3.02 కి.మీ మురుగుకాల్వలు దెబ్బతిన్నాయి.

* ప్రకాశం జిల్లాలో 60 వీధి దీపాలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో 629, కడపలో 259, చిత్తూరులో 95 విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. ప్రకాశం జిల్లాలో విద్యుత్తు శాఖకు రూ.కోటి మేరకు నష్టం వాటిల్లింది.

* చిత్తూరు జిల్లాలో వాగులు, వంకల్లో ప్రవాహ ఉద్ధృతి తగ్గింది. అయితే... వాగులను దాటే క్రమంలో గురువారం గల్లంతైన అయిదుగురు వ్యక్తులు మృతి చెందారు.

* కృష్ణా జిల్లాలో మొత్తం 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సగానికిపైగా వర్షాలకు దెబ్బతింది. 2.35 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ధాన్యం పూర్తిగా తడిసిపోయి, కంకులు నేల రాలిపోతున్నాయి. పశ్చిమ కృష్ణా ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వేరుసెనగ, పత్తి, మినుము పంటలు దెబ్బతిన్నాయి.

* గుంటూరు జిల్లా రైతులను తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 33 మండలాల్లో 413 గ్రామాల పరిధిలో 1.24లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి 1,23,905 లక్షల హెక్టార్లలో దెబ్బతింది.

* ఒంగోలులో పోతురాజు కాలువకు వరద వచ్చి చుట్టుపక్కల కాలనీల్లోకి నీరు చేరింది. 35 మండలాల్లో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్ష హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగి 50 శాతానికి పైగా నష్టం వాటిల్లిందని, దీని విలువ సుమారుగా రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

* తూర్పుగోదావరి జిల్లాలో నివర్‌ తుపాను ప్రభావంతో 59 మండలాల్లోని 602 గ్రామాల్లో 55,671.82 హెక్టార్లలో వరి.. 1,087 హెక్టార్లలో పత్తి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి మధ్య డెల్టాలో ఇంకా 60% కోతలు కోయాలి.

* పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొవ్వూరు, నిడదవోలు, భీమడోలు, భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆచంట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. అపరాలు, పొగాకు, పత్తి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 47 మండలాల్లోని 21,234 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories