ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నియమాలు పాటించాలి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నియమాలు పాటించాలి
x
Highlights

ఏపీలో త్వరలో పరిషత్ నగారా మోగనుంది. కిందిస్థాయి రాజకీయ నేతలంతా పరిషత్ పోరుకు సిద్ధమయ్యారు. టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు క్యూ కడుతున్నారు....

ఏపీలో త్వరలో పరిషత్ నగారా మోగనుంది. కిందిస్థాయి రాజకీయ నేతలంతా పరిషత్ పోరుకు సిద్ధమయ్యారు. టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు క్యూ కడుతున్నారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉన్నట్టు అర్ధమవుతోంది. ఈనెల 17 లోపు పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంది. పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అందులో భాగంగా..

మండల పరిషత్(ఎంపీటీసీ)

మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గానికి (ఎంపీటీసీ)గా పోటీ చేయాలంటే పోటీచేసే అభ్యర్థి ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండల పరిధిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చు.. కానీ రిజర్వేషన్ చూసుకోవాలి.

జిల్లా పరిషత్ (జడ్పీటీసీ)

జిల్లా పరిషత్ (జడ్పీటీసీ)గా పోటీ చేయాలంటే జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కూడా ఉంటుంది.

*అదే విధంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అభ్యర్థులు తమ నామినేషన్ల సెట్లను నాలుగు సెట్లకు మించి దాఖలు చేయకూడదు.

*గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులుగా పోటీ చేయదలచిన అభ్యర్థులు ఆయా పార్టీల ధ్రువీకరణ పత్రాలు(బీ ఫారం) తప్పనిసరిగా సమర్పించాలి.

*అంతే కాకుండా గ్రామ సేవకులకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డైరెక్టర్లు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్లర్లు పోటీ చేయడానికి అనర్హులు.

*గతంలో లంచాలు, అవినీతి కేసులలో అభియోగం మోపబడ్డవారు.. విధుల నుంచి సస్పెండ్ అయిన ఉద్యోగులు ఐదేండ్ల కాలపరిమితి వరకు పోటీచేయకూడదు.

*అలాగే వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవించిన వారు సైతం శిక్షాకాలం ముగిసిన ఐదేండ్ల తరువాతే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉంది.

*మానసిక స్థితి సరిగ్గా లేనివారు పోటీకి అనర్హులే.

*ఇక కీలకమైనది అధిక సంతానం 1995 మే 31 తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు.

*షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ కులం, వర్గం తెలియపరిచే ధ్రువపత్రాలపై అర్హులైన గెజిటెడ్ అధికారి చేత సర్టిపై చేయించి తమ నామినేషన్ పత్రంతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.

*పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల డిపాజిట్లు ఇలా

*జిల్లా ప్రాదేశిక నియోజకవర్గానికి పోటీచేసే వారు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు రూ.2,500 మాత్రమే చెల్లించాలి.

*ఇక మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గానికి పోటీ చేసే వారు రూ.2,500 డిపాజిట్‌ చెల్లించాలి.

అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 మాత్రమే చెల్లించాలి.

*అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాల నిమిత్తం నామినేషన్ దాఖలు చేసే ముందు బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరిచి ఆ ఖాతాను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.

*ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన ఖాతా ద్వారానే అభ్యర్థి ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories