కింజారపు రామ్మోహన్ నాయుడు: 26 ఏళ్ళకు ఎంపీ, 36 ఏళ్ళకే మంత్రి

MP Ram Mohan Naidu Becomes Youngest Ever Union Minister At 36
x

కింజారపు రామ్మోహన్ నాయుడు: 26 ఏళ్ళకు ఎంపీ, 36 ఏళ్ళకే మంత్రి 

Highlights

నరేంద్ర మోదీ కేబినెట్ లో 36 ఏళ్లకే తెలుగుదేశం పార్టీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడికి చోటు లభించింది.

Rammohan Naidu: కింజారపు రామ్మోహన్ నాయుడు నరేంద్ర మోదీ కేబినెట్‌లో అందరికన్నా చిన్న వయసున్న మంత్రిగా రికార్డులకెక్కారకు. ఆయన 2014 లో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు 26 ఏళ్ళు. అతి చిన్నవయసులో ఎంపీగా ఎన్నికైన వారిలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. తండ్రి ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణంతో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుండి వరుస విజయాలు సాధించారు.

మోదీ కేబినెట్ లో 36 ఏళ్లకే మినిస్టర్

నరేంద్ర మోదీ కేబినెట్ లో 36 ఏళ్లకే తెలుగుదేశం పార్టీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడికి చోటు లభించింది. మోదీ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. రామ్మోహన్ నాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. గుంటూరు నుండి తొలిసారి విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి లభించింది. పార్టీకి విధేయుడిగా ఉండడంతో పాటు బీసీ సామాజిక వర్గం కూడ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటుకు కారణమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడ రామ్మోహన్ నాయుడు పనిచేశారు. గత పార్లమెంట్ లో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా కూడా ఆయన వ్యవహరించారు. లోక్ సభలో మంచి పనితీరు కనబర్చినందుకు 2020లో సంసద్ రత్న అవార్డు కూడా ఆయనకు లభించింది.


తండ్రి రికార్డ్ బ్రేక్ చేసిన రామ్మోహన్ నాయుడు

1996లో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 39. అయితే, ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు మాత్రం 36 ఏళ్లకే కేంద్ర మంత్రి అయ్యారు. తండ్రీ కొడుకులిద్దరూ కూడా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలకంగా మారిన సమయంలోనే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేశారు.

అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్ నాయుడు జన్మించారు. మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సోసైటీ హస్టల్ లోఉంటూ చదివారు. ఆ తర్వాత హైద్రాబాద్ భారతీయ విద్యాభవన్ లో 4, 5 తరగతులు చదివారు. ఎర్రన్నాయుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆరో తరగతి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత అమెరికా ఐలాండ్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. విద్యను పూర్తి చేసి తిరిగి ఢిల్లీకి వచ్చి ఓ ఇంటీరియర్ కంపెనీలో చేరారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణించారు. ఈ ఘటన రామ్మోహన్ నాయుడును రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది.

ఎంపీగా పోటీ చేయాలనేది కుటుంబ సభ్యుల నిర్ణయం

కింజారపు ఎర్రన్నాయుడు 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చే విషయమై కుటుంబసభ్యులు చర్చించారు. ఈ చర్చల తర్వాత రాజకీయాల్లోకి రావాలని రామ్మోహన్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయాలా...ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనే విషయమై కూడా చర్చించారు.

ఉన్నత విద్యావంతుడైన రామ్మోహన్ నాయుడిని ఎంపీగా పోటీ చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. తాను మాత్రం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలిపారు. రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లేదా అసెంబ్లీలలో ఏ స్థానం నుండి పోటీ చేయాలనే విషయమై కూడా తమ కుటుంబంలో జరిగిన చర్చ గురించి అచ్చెన్నాయుడు చంద్రబాబుకు వివరించారు. ఈ ప్రతిపాదనకు అప్పట్లో చంద్రబాబు అంగీకరించారు. 2014 ఎన్నికలకు చాలా రోజుల ముందే శ్రీకాకుళం ఎంపీ స్థానం నుండి రామ్మోహన్ నాయుడే అభ్యర్ధి అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు.


పదేళ్ల తర్వాత కేంద్ర కేబినెట్ లోకి తెలుగుదేశం

2014లో కేంద్రంలో ఎన్ డీ ఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరింది. ఆ సమయంలో కేంద్ర మంత్రిగా ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మోదీ కేబినెట్ లో పని చేశారు. 2018లో చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరాజయం పాలైంది. ఆ తరువాత బీజేపీతో విభేదాలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిసి 2024 ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. సొంతంగా 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొన్న తెలుగుదేశం ఎన్ డీ ఏలో ఆ పార్టీ కీలక భాగస్వామిగా మారింది. మోడీ కొత్త మంత్రివర్గంలో ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. వారిలో ఒకరు బీజేపీ నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ. మిగిలిన ఇద్దరు టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. వీరిలో క్యాబినెట్ హోదా రామ్మోహన్ నాయుడికే దక్కింది.

ఉత్తరాంధ‌్ర టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటను వైఎస్ఆర్ సీపీ బద్దలు కొట్టింది. ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం తన పట్టును నిలుపుకుంది. ఉత్తరాంధ్ర ప్రజలు తమ పార్టీపై పెట్టుకున్న నమ్మకం కారణంగా ఈ ప్రాంతానికి చంద్రబాబు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories