DPR for Vizag Metro: విశాఖకు త్వరలో మెట్రో.. సిద్ధమవుతున్న డీపీఆర్

DPR for Vizag Metro: విశాఖకు త్వరలో మెట్రో.. సిద్ధమవుతున్న డీపీఆర్
x
VIZAG METRO
Highlights

DPR for Vizag Metro: విశాఖను రాజధానిగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం దానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పనులు చేపట్టడంతో పాటు గతంలోనే ఏర్పాటు చేయాలనుకున్న మెట్రో రైలుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు

DPR for Vizag Metro: విశాఖను రాజధానిగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం దానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పనులు చేపట్టడంతో పాటు గతంలోనే ఏర్పాటు చేయాలనుకున్న మెట్రో రైలుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అయితే దీనిని గతంలో కొంతమేర అనుకున్నా, దానిని మరింత విస్తరించేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్ సిద్ధమవుతుండగా, వీలైనంత తొందర్లో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.

విశాఖ సాగర తీరంలో మెట్రో రైలు పరుగు తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. లైట్‌ మెట్రో రైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ బిజీగా ఉంది. ట్రామ్‌ కారిడార్‌కు రూ.100 నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు. మొత్తం 79.91 కి.మీ మేర లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సుమారు రూ.16వేల కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే లైట్‌ మెట్రోతో పోలిస్తే ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణం తక్కువ ఖర్చు అవుతుందనే అంచనాకు వచ్చారు అధికారులు. లైట్‌ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ని నవంబర్‌ చివరినాటికి, ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ని డిసెంబర్‌ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదించేందుకు యూఎంటీసీ అంగీకరించింది.

విశాఖ నగరంలో ఏ సమయంలో ఎంత ట్రాఫిక్‌ ఉంటోంది.. మెట్రో కారిడార్‌ రూట్‌మ్యాప్‌లలో జరుగుతున్న అభివృద్ధి 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్‌ వంటి అంచనాలతో డీపీఆర్‌ సిద్ధమవుతోంది. బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్‌ దేశాల ప్రాజెక్ట్‌లలో ట్రామ్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. డీపీఆర్‌ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో స్వల్ప మార్పులుండనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది చివరి నాటికల్లా లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి అయితే.. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ పూర్తిచేసి.. 2021 జూన్‌ నాటికి లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు మొదలు కానున్నాయి. మార్చి 2024 నాటికి లైట్‌ మెట్రోలో ఒక కారిడార్‌ నుంచి మెట్రో రైలు పరుగులు పెట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories