TTD Temple Closure : మార్చి 3న తిరుమల ఆలయం మూసివేత.. 11 గంటల పాటు దర్శనం కట్.. అసలేం జరుగుతోంది?
మార్చి 3న తిరుమల ఆలయం మూసివేత.. 11 గంటల పాటు దర్శనం కట్.. అసలేం జరుగుతోంది?
TTD Temple Closure : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీన చంద్రగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో ఆ రోజు శ్రీవారి ఆలయ తలుపులను చాలా సమయం పాటు మూసి ఉంచుతున్నట్లు ప్రకటించింది. గ్రహణ ప్రభావం కారణంగా ఆలయ సంప్రదాయాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ మార్పులను గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సాధారణంగా గ్రహణం ఏర్పడటానికి 6 గంటల ముందుగానే ఆలయాన్ని మూసివేయడం ఆచారంగా వస్తోంది. మార్చి 3న మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఉదయం 9 గంటలకే శ్రీవారి ఆలయ తలుపులను అర్చకులు మూసివేస్తారు. గ్రహణం వీడిన తర్వాత సాయంత్రం 7:30 గంటలకు తలుపులు తీసి, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8:30 గంటల నుంచి మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు.. దర్శనాలపై ప్రభావం
ఆలయం మూసివేసే సమయంలో నిర్వహించాల్సిన పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం కారణంగా దాదాపు 11 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనున్నాయి. దీనివల్ల సాధారణ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో, భక్తులు ఓపికతో సహకరించాలని కోరారు. ఆ రోజు తిరుమలలో బస చేసే వారు కూడా గ్రహణ సమయ నియమాలను పాటించాలని సూచించారు.
కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవం
అదే రోజున తిరుమల శేషాచల అడవుల్లోని పవిత్ర కుమారధార తీర్థం వద్ద ముక్కోటి ఉత్సవం జరగనుంది. ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఈ తీర్థంలో పవిత్ర స్నానం ఆచరిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, యవ్వనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఉత్సవానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
గ్రహణం, ముక్కోటి ఉత్సవం ఒకే రోజు రావడంతో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. దర్శన సమయాల్లో మార్పులు ఉన్నందున, భక్తులు తమ ప్రయాణాలను తదనుగుణంగా మార్చుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. కొండపైకి వచ్చే వారు ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకుని రావాలని అధికారులు సూచించారు.




