కర్నూలు జడ్పీ పీఠంపై కన్నేసిన రాజకీయ ఉద్ధండులు

కర్నూలు జడ్పీ పీఠంపై కన్నేసిన రాజకీయ ఉద్ధండులు
x
Highlights

కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైంది. జడ్పీ పీఠాన్ని అన్‌ రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయిస్తూ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌...

కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం అప్పుడే లాబీయింగ్ మొదలైంది. జడ్పీ పీఠాన్ని అన్‌ రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయిస్తూ పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఎం.గిరిజా శంకర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు. వైసీపీ, టీడీపీ ల నుంచి రాజకీయ ఉద్ధండులు జడ్పీ పీఠానికి పోటీ పడుతున్నాయి. వైసీపీ నుంచి ప్రముఖంగా ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణి పేరు వినిపిస్తుంది. 2014 లో కర్నూలు నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మోహన్ రెడ్డి. ఆ తరువాత కొద్దికాలానికే టీడీపీలో చేరిపోయారు.

2019 ఎన్నికల్లో టీడీపీలో టిక్కెట్ రాకపోవడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కర్నూలు వైసీపీ అభ్యర్థి విజయానికి తీవ్రంగా కృషిచేశారు. ఈసారి జరగబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో తన సతీమణి విజయమానోహరి చాగలమర్రి లేదంటే ఉయ్యాలవాడ మండలాలు జనరల్‌కు రిజర్వేషన్‌ ఖరారైతే ఇందులో ఏదో ఒక చోటనుంచి పోటీ చేయించాలని తద్వారా జడ్పీ చైర్మన్ పీఠంపై ఆమెను కూర్చోబెట్టాలని ప్రణాళిక రచిస్తున్నారట మోహన్ రెడ్డి.

ఇందుకోసం జిల్లా కీలక నేతలను ఒప్పిస్తున్నారట. మరోవైపు టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ కూడా జడ్పీ పీఠంపై కన్నేశారట. వాస్తవానికి కోట్ల కుటుంబం టీడీపీలో చేరే సమయంలో సుజాతమ్మకు జడ్పీ అవకాశం ఇవ్వాలని కోరారట కోట్ల. రిజర్వేషన్ లో ఓసీ వస్తే కోడుమూరు లేదంటే పత్తికొండ నుంచి పోటీ చెయ్యాలని సుజాతమ్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కోట్ల కుటుంబంతోపాటు కెఇ కృష్ణమూర్తి వర్గం కూడా జడ్పీ పీఠాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి కూడా జడ్పీ బరిలో నిలవాలని అనుకుంటున్నట్టు సమాచారం. జిల్లాలో నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది. బైరెడ్డి తన కుమార్తె తోపాటు ఇటీవలే బీజేపీలో చేరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories