logo
ఆంధ్రప్రదేశ్

Kovel Foundation: కోవెల్ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహణ

Kovel Foundation: కోవెల్ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహణ
X
Kovel Foundation
Highlights

Kovel Foundation: ప్రకృతి వ్యవసాయం అమలు చేయడంలో ప్రపంచానికే ఆంద్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్మన్ టి. విజయ్ కుమార్ పేర్కొన్నారు.

- ఆంద్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శం

- రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్

- కోవెల్ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహణ

- జూమ్ ద్వారా పాల్గొన్న నాలుగు జిల్లాల ప్రతినిధులు

Kovel Foundation: ప్రకృతి వ్యవసాయం అమలు చేయడంలో ప్రపంచానికే ఆంద్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్మన్ టి. విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూమ్ ద్వారా నిర్వహించిన వేడుకల్లో విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఆచరించడంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంద్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. ఇక్కడ ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల నుంచి మెరుగైన ఉత్పుత్తులు దిగుబడి వస్తున్నాయన్నారు.

ఈ రోజు ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిగా ఆచరిస్తున్న విశాఖ, కర్నూలు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని 12 గ్రామాలను బయో విలేజీలుగా కోవెల్ సంస్థ ప్రకటించడం ఆనందించదగ్గ విషయమన్నారు. ప్రకృతి సాగు పద్ధతిలో సాగు చేసే రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులను దూరం చేయడంతో పాటు భూమిలో ఇమిడి ఉన్న కర్భనం ( సేంద్రీయ పదార్థం) నశించకుండా, పెంచే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి పంటలో పోషక విలువలు పుష్కలంగా ఉండాలంటే భూమిలో కర్భనం పాత్ర కీలకమన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోడు చేయడం, చెత్తను కాల్చడం, భూమి కోతకు గురికావడం వల్ల ఇది మరింత తగ్గుతోందన్నారు. ఇది లేకపోతే భవిషత్తు లేదన్నారు.

పంటలు పండేందుకు ఇది ముడిసరుకుగా ఉపయోగపడుతుందన్నారు. ఈ విధంగా భూమిలో జీవవైవిద్యం కోల్పేతే మనకు అన్ని విధాలుగా నష్టం కలుగుతుందన్నారు. వీటిని సంస్కరించే భాద్యత అందిరిపై ఉందన్నారు. సుభాష్ పాలేకర్ చెప్పినట్టుగా ప్రకృతి సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి అనుగుణంగా సాగు చేస్తేనే మనుగడ ఉంటుందన్నారు. ఇదేకాకుండా ఏడాది పాటు భూమిని అన్ని రకాల పంటలతో కప్పి ఉంచడం వల్ల మేలైన ఫలితాలొస్తాయన్నారు. ఎన్ని రకాల పంటలు ఉంటే అంత మనకు మంచిందన్నారు.

రాబోయే తరాలకు పూర్వం మాదిరి అన్ని పోషకాలుండే భూమిగా అప్పగించాలంటే ప్రకృతి సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. అలా కాకుండా చేస్తే జీవన వైవిద్యం దెబ్బతిని దాని ప్రభావం వాతావరణ పరిస్థితులపై పడుతుందన్నారు. దీంతో పాటు పశు సంపదను వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్నారు.భూమి సజీవంగా పోషకాలతో ఉండాలంటే సూక్ష్మజీవులు ఉత్పన్నం కావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా సంస్థ సీఈవో కృష్ణారావు మాట్లాడుతూ కోవెల్ నాలుగు జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయంపై పనిచేస్తుందన్నారు. రాబోయే ఐదేళ్లలో మరింత ప్రగతి సాధించే దిశగా సంస్థ కృషి చేస్తోందన్నారు.

మూడు బయో మండలాలు, 14 బయో పంచాయతీలు, 226 బయో గ్రామాలు, 20 ప్రకృతి సేద్య ఉత్పత్తిదారుల సంఘాలతో 20 కోట్ల టర్నోవర్ తో కోవెల్ ఉత్పత్తిదారుల కంపెనీ, పది రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో వివిధ సంఘాల భాగస్వామ్యంతో పెంపొందించేలా 2వేల మంది చాంఫియన్ రైతులతో రెండు లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు చేశామన్నారు. ఈ సందర్భంగా బయో గ్రామాల్లోని రైతులు సాధించిన ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ యుగంధర్ రెడ్డి, జట్టు సంస్థ డైరక్టర్ పారినాయుడు, అక్షర చీఫ్ మెంటార్ మురళీధర్, ఏపీపీఐ ప్రతినిధి రఘుతో పాటు నాలుగు జిల్లాల సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Web TitleKovel Foundation in Andhra Pradesh Organizing Tribal Day celebrations
Next Story