Karunakar Reddy letter to the Vice President: వరవరరావు విడుదల కోసం వేడుకోలు.. ఉప రాష్ట్రపతికి కరుణాకరరెడ్డి లేఖ

Karunakar Reddy letter to the Vice President: వరవరరావు విడుదల కోసం వేడుకోలు.. ఉప రాష్ట్రపతికి కరుణాకరరెడ్డి లేఖ
x
Karunakar Reddy
Highlights

Karunakar Reddy letter to the Vice President: విరసం నాయకుడు వరవరరావును వెంటనే విడుదల చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభ్యర్థించారు.

Karunakar Reddy letter to the Vice President: విరసం నాయకుడు వరవరరావును వెంటనే విడుదల చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభ్యర్థించారు. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రముఖ కవి, విరసం నాయకుడు వరవరరావును విడుదల చేసి, ఆయన ప్రాణాలను కాపాడాలని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని అభ్యర్థించారు.

ముంబైలోని తలోజా జైలులో కొవిడ్‌ బారినపడి ముంబైలోని జేజే ఆస్పత్రిలో 81 ఏళ్ల వరవరరావు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉపరాష్ట్రపతికి కరుణాకర్‌రెడ్డి లేఖ రాశారు. వరవరరావును ఆ లేఖలో తన రాజకీయ గురువుగా ఆయన అభివర్ణించారు. సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీ రోజుల్లో వెంకయ్యనాయుడు, వరవరరావులతో కలసి హైదరాబాద్‌ ముషీరాబాదు జైలులో తాను గడిపిన రోజుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. వరవరరావు వయసు, అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని, మానవత్వంతో ఆయన విడుదలకు సహకరించాలని కోరారు.

ఆ లేఖ ప్రతిని మీడియాకు విడుదల చేశారు. ''ఓ వృద్ధ శల్య శరీరుని (వరవరరావు స్థితిని ఉద్దేశించి) ప్రాణం మీరు కాపాడాలి. 48 సంవత్సరాల క్రితం రాజకీయ ఆలోచనల అంకురార్పణ దశలో నాకు లభించిన ఎందరో గురువుల్లో వరవరరావు ఒకరు. ఎమర్జెన్సీ రోజుల్లో బాధితులుగా మీరు, నేను 21 నెలలపాటు ముషీరాబాద్‌ జైలులో ఉన్నాం. అప్పుడు ఆయన మన సహచరుడు. సహచర్యం భావజాలంలో కాదుగానీ, కటకటాల వెనుక మనమంతా నాడు కలిసి ఉన్నాం. రాజకీయ సిద్ధాంతంలోనూ, జన క్షేమం కోసం నడిచే మార్గంలోనూ ఎవరి భావనలు వారివే. కానీ మనం మనుషులం.

81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాలి. 53 సంవత్సరాలుగా అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం...మంచం పట్టిన వృద్ధుడు సాధించగలడా? ఈ స్థితిలో ఆయనను ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా? రాజ్యం ఇంత కాఠిన్యమా.. న్యాయం సుదూరమా.. అని ఏ మేధావీ ఈ దేశంలో భావించే పరిస్థితి రాకూడదు. వరవరరావు విడుదల కోసం మీ జోక్యం అవసరం. సానుభూతితో ఆయన ప్రాణాలను కాపాడండి'' అని ఆ లేఖలో భూమన కరుణాకర్‌ రెడ్డి అభ్యర్థించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories