వైఎస్ జగన్‌కు షాక్.. టీడీపీలో చేరనున్న ఆనం కూతురు కైవల్యారెడ్డి ..!

Kaivalya Reddy Daughter of Anam Ramanarayana Reddy Joins TDP | Off The Record
x

వైఎస్ జగన్‌కు షాక్.. టీడీపీలో చేరనున్న ఆనం కూతురు కైవల్యారెడ్డి ..! 

Highlights

* కైవల్య లోకేష్‌ను కలవడం తనకు సంబంధం లేదన్న ఆనం

Nellore: తండ్రి ఆదేశాలతోనే ఆనం కూతురు తన భర్తతో కలసి లోకేష్‌ని కలిసిందా? కూతురు కొత్త నిర్ణయం వెనుక ఆనం ఉన్నారా?ఆయన విషయంలో మాజీ మంత్రి అనిల్ చేసిన ఆరోపణలన్నీ నిజం కాబోతున్నాయా? ఆనంతో సాన్నిహిత్యంగా ఉంటున్న మంత్రి కాకాణి పొలిటికల్ స్టాండ్ ఎలా ఉండబోతోంది? రాజకీయ రాజధాని నెల్లూరులో ఉత్కంఠ రేపుతున్న ఆ అంశం ఏంటి?

నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఆనం ఇంటి నుంచి కొత్త రాజకీయ సమీకరణాలు తెరలేచాయి. అధికారం పార్టీలో ఉన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యరెడ్డి దీనికి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. తన భర్త బద్వేల్ టీడీపీ నాయకుడు రితీష్‌రెడ్డితో కలిసి ఆమె తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్‌ను కలవడం చర్చనీయాంశమైంది. వైసీపీలో సీనియర్‌ నాయకుడి కూమార్తె అయిన కైవల్యారెడ్డి లోకేష్‌ను కలవడం వెనుక ఆంతర్యమేంటి? దీనికి ముందు నెల్లూరు అధికార పార్టీలో నేతల మధ్య జరిగినా జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇవే ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

సుధీర్ఘ రాజకీయ అనుభవానికి చిరునామాగా ఉన్న ఆనం ఫ్యామిలీ పాలిటిక్స్‌ రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ విభేదాలు ఇప్పుడు మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, విమర్శలు, వేధింపులు, ఒకరే లక్ష్యంగా వ్యూహాలు, ప్రత్యర్థులతో లోపాయకారి ఒప్పందాలతో తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు వంటి ఘటనలతో రాజకీయాలు సెగలు రగిలించాయి. ఇలాంటి సమయంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం కుమార్తె ఆనం కైవల్యారెడ్డి, తన భర్త రితీష్‌రెడ్డి తో కలిసి టంగుటూరులో నారా లోకేష్‌ని కలవడం, ఆయన్ను అభినందించడం, సత్కరించడం పలు సందేహాలకు తెరలేపింది.

తండ్రి అడుగుజాడల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కైవల్యా అడుగుపెడుతోందనే ప్రచారం ఇప్పటికే జరుగుతుండగా, వచ్చే ఎన్నికల్లో కైవల్యారెడ్డి ఆత్మకూరు నుంచి పోటీకి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారని ఆనం ఇంటనే చర్చ జరుగుతోంది. నెల్లూరు, ఆత్మకూరు నుంచి రెండు టికెట్‌ ఆశిస్తున్న ఆనం అంగీకారం అధికార పార్టీలో వర్కవుట్‌ కాకపోతే వైసీపీకి గుడ్ బై చెబుతారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కైవల్యారెడ్డి లోకేష్‌ని కలవడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆనంపై జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామం ఊతమిస్తోందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కైవల్యారెడ్డి పక్కా వ్యూహంతోనే లోకేష్‌ని కలిశారని, తన తండ్రికి తెలియకుండా ఇంతటి సాహసం ఆమె చేయలేదన్న ప్రచారం నడుస్తోంది. కచ్చితంగా ఇది ఆనం ఆదేశాలతోనే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాస్తవానికి, నెల్లూరు నగర రాజకీయాల్లో దశాబ్దకాలంగా ఆనం వర్సెస్ అనిల్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే గత మూడేళ్ల నుంచీ మౌనంగా ఉన్న ఆనం ఒక్కసారిగా స్వరం పెంచారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌పై పరోక్ష యుద్దానికే దిగారు. కొన్ని చోట్ల పలు ఆరోపణలు కూడా చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో నగరంలో కొన్ని ఆంక్షలున్నా మంత్రి కాకాణి కోసం ఆనం అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై కూడా ఆనం కుటుంబ నేతలు నగర ఎమ్మెల్యేపై దూషణలకు దిగారు. ఈ క్రమంలోనూ అనిల్ కూడా తీవ్రంగానే స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రకటించాలంటూ సవాల్ కూడా విసిరారు. ఇలాంటి రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లోనే ఆనం కైవల్య ఒంగోలులో నారా లోకేష్‌ని కలవడం అనిల్‌ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయన్న చర్చ జరుగుతోంది.

2024 ఎన్నికలకు ముందు చూపుగానే కూతరు ద్వారా ఆనం మార్గం సుమగం చేసుకుంటున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా అనిల్ చెప్పినట్లు ఆనం కుటుంబం పార్టీ మారేందుకే సిద్ధం అయ్యిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అదీగాక, కొన్నేళ్ల నుంచి ఆనం, కాకాణి కుటుంబాల మధ్య సఖ్యత లేదు. కాకాణి జడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే వైసీపీలో చేరారు. ఆపై జెడ్పీ నూతన భవన ప్రారంభోత్సవానికి అడ్డంకులు సృష్టించారు. దీంతో ఆనం కాకాని మధ్య అంతరం ఏర్పడింది. అయితే మొదటి సార్వత్రిక ఎన్నికలకు ముందు రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడంతో తిరిగి ఆనం, కాకాణిల మధ్య కుటుంబ మైత్రీ బంధం ఒకటైంది. ఇటీవల గోవర్ధన్‌రెడ్డి మంత్రి అయ్యాక జిల్లాలో ఆనం కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మంత్రి కాకాణికి నెల్లూరు జిల్లాలో ఘన స్వాగతం కూడా పలికారు. ఈ క్రమంలోనే అనిల్‌ని, కాకాణిని స్వయంగా సీఎం జగన్‌ పిలిచి మాట్లాడటంతో సమస్య కొంత సద్ధిమణిగినా.. ఆనం కుటుంబం మాత్రం రగిలిపోతుందట.

ఇదే సమయంలో రెడ్డి సామాజికవర్గమంతా కలసి బీసీ నేత అయిన అనిల్‌ని ఒంటరిని చేయాలన్న కుట్ర జరుగుతున్నట్లు పెద్ద చర్చకు తెర లేచింది. మంత్రి కాకాణి ఆనంను వెనకేసుకొస్తున్నారని అనుకుంటున్న క్రమంలో ఆయన కూతురు కైవల్య లోకేష్‌ను రాజకీయంగా దుమారం రేపింది. మరి దీనికి మంత్రి కాకాణి ఏం చెబుతారోనన్న ఆతృత కనిపిస్తోంది. ఏమైనా ఆనం కైవల్య ద్వారా టీడీపీలో చేరికకు ఆనం కుటుంబం మార్గం వేస్తోందన్న చర్చ మాత్రం జిల్లాలో రాజుకుంటుంది. అయితే, తన కుమార్తె కైవల్య చిన్న పిల్ల కాదని తనకు ఏది మంచో ఏది చెడో తెలుసునని, లోకేష్‌ని ఎందుకు కలసిందో అది తన వ్యక్తిగతమే కానీ, దానికి తమ కుటుంబంతో సంబంధం లేదని ఆనం తన అనుచరుల వద్ద కొట్టిపారేసినట్టు సమాచారం. మొత్తానికి, ఒంగోలులో మహానాడుతో ఏపీ రాజకీయాల్లో రాజకీయ వేడి రాజుకుందని చర్చ జరుగుతుండగా, వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories