Avinash Reddy: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్‌.. విడుదలలో రహస్యం..?

Kadapa MP Avinash Reddy Arrest Is there a Secret in the Release?
x

Avinash Reddy: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్‌.. విడుదలలో రహస్యం..?

Highlights

Avinash Reddy: ఈనెల 3న సీబీఐ కార్యాలయానికి వచ్చినప్పుడే అరెస్టు.. విడుదల..

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, 5 లక్షల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 3న సీబీఐ కార్యాలయంలో అవినాశ్ రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్‌, విడుదల జరిగాయి. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి.. తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్ట్‌ అనంతరం తననూ అరెస్ట్‌ చేస్తారన్న ఆందోళనతో ఏదో ఒక కుంటి సాకు చెబుతూ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. ఇందులో భాగంగానే గతనెల 16 నుంచి విచారణకు హాజరు కాకుండా తల్లి కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారంటూ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో సీబీఐ బృందం కర్నూలు వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆసుపత్రి ముందు అవినాశ్ అనుచరులు పెద్దఎత్తున మోహరించడంతో సీబీఐ స్థానిక ఎస్పీ సాయం కోరింది. శాంతిభద్రతల కారణం చూపుతూ ఆ జిల్లా పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సీబీఐ వెనుదిరగాల్సి వచ్చింది.

మరోవైపు హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు.. గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఒకవేళ అవినాశ్ రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సి వస్తే... పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చినప్పుడు సాంకేతికంగా అరెస్ట్‌ చేసి, పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. అయితే... అరెస్ట్‌, విడుదల విషయాన్ని అటు సీబీఐ గానీ, ఇటు అవినాశ్ రెడ్డి గానీ వెల్లడించకుండా గోప్యత పాటించారు.

కాగా... వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి విషయంలోనూ సీబీఐ అధికారులు ఇదే విధానాన్ని అనుసరించారు. దస్తగిరికి న్యాయస్థానం 2021 అక్టోబరు 22న షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో అదే సంవత్సరం అక్టోబరు 23న సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్‌ చూపి, 20 వేల రూపాయల పూచీకత్తు తీసుకొని వెంటనే విడుదల చేశారు. మరోవైపు అవినాశ్ రెడ్డికి హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories