మహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?

Jr NTR Did not Get Invitation for TDP Mahanadu 2022 | Off The Record
x

మహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?

Highlights

TDP - Mahanadu - Jr NTR: *టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? *అసలు చిన్న ఎన్టీఆర్‌ తెలుగుదేశంలోనే ఉన్నారా?

TDP - Mahanadu - Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు మహానాడు ఆహ్వానం అందలేదా? బాబాయ్ ఉండగా అబ్బాయి ఎందుకని ఊరుకున్నారా? కొన్నిచోట్ల జూనియర్‌ను కాబోయే సీఎం అంటూ తెలుగు తమ్ముళ్లు కీర్తిస్తుంటే... తెలుగుదేశం అధినాయకత్వం చిన్న ఎన్టీఆర్‌ను లైట్‌ తీసుకుందా? మూడురోజుల టీడీపీ పండగకు నందమూరి వారసుడిని ఎందుకు పిలవలేదు? రాజకీయ తీర్మానాల వేదికపై ఎన్టీఆర్‌ కనిపించకపోవడంపై తమ్ముళ్లు ఏమనుకుంటున్నారు? ఇంతకీ చిన్న ఎన్టీఆర్‌ మహానాడుకు వద్దామని అనుకుంటున్నారా? రానని మొండికేస్తున్నారా..?

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం టీడీపీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నిన్నామొన్నటి వరకు టీడీపీలో ఉన్న నిస్తేజాన్ని పదడుగుల లోతులో పాతి పెట్టాలంటే జూనియర్ రావాలని తమ్ముళ్లు అధినేత ముందే తమ మనసులో మాటను బయటపెట్టారు. అలా ఎన్టీఆర్‌ అవసరం పార్టీకి ఉందని అందరూ అనుకుంటున్న వేళ ఆయనకు మహానాడు ఆహ్వానం అందకపోవడంపై తమ్ముళ్లు తెగ ఆందోళన చెందుతున్నారట.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీలో నెలకొన్న ఆందోళనకు ముగింపు పలకాలంటే, రాజకీయ శూన్యతను భర్తీ చేయాలంటే జూనియర్‌ ఎన్టీఆరే సరైనోడని తమ్ముళ్లు చాలా మంది చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌కు టీడీపీ అవసరం కంటే... టీడీపీకే ఆయన అవసరం ఉందని అధినేత ముందే చాలా సందర్భాల్లో తమ మనసులో మాటను వెల్లగక్కారు. ఒకదశలో అధినేత సొంత నియోజకవర్గమైన కుప్పంలోనైతే కాబోయే సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. తెలుగుదేశంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రాధాన్యం ఎంత ఉందో కార్యకర్తలు అంతలా నెత్తి నోరు మొత్తుకుంటుంటే, ఆయనకు కనీసం మహానాడు ఆహ్వానం పంపకపోవడం ఏంటన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. పెద్ద ఎన్టీఆర్‌ తర్వాత అంతటి చరిష్మా ఉన్న చిన్న ఎన్టీఆర్‌ను పిలిస్తే బాగుండేదని మహానాడులోనే టాక్‌ వినిపిస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత టీడీపీని బలమైన శక్తిగా తయారుచేయాలంటే జూనియర్ రావాలి! ఇదీ తెలుగు తమ్ముళ్ళు అధినేత ముందు పెట్టిన ఓ ప్రతిపాదన. ప్రతి నియోజకవర్గంలోనూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, నేతలు కూడా ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలంటూ చంద్రబాబు ఎదుటే పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో షాక్‌ అయ్యారు. ఏం చెప్పాలో, ఎలా సర్దిచెప్పాలో తెలియక తికమక పడ్డ సందర్భాలూ ఉన్నాయి. అయినా జూనియర్‌ ప్రస్తావన ఏమీ తీసుకురాకుండా అక్కడికక్కడ ఏదో నెట్టుకొచ్చిన అధినేత... దీనిపై ఇంటర్నల్‌గా చాలా సీరియస్‌గానే స్పందించారట.

జూనియర్‌ను పార్టీలోకి పిలవాలన్న దానిపై అధినేత ఏ రకమైన ప్రకటన చేయనప్పటికీ... ఇప్పటికీ ఎన్టీఆర్‌ టీడీపీలోనే ఉన్నారని ఒక వర్గం నేతలు అంటున్నారు. అయితే జూనియర్ మాత్రం తాను రాజకీయాల్లోకి వస్తారా రారా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అలా అని టీడీపీలో లేనని చెప్పలేదు.. ఉన్నాననీ ప్రకటించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ ఢీకొట్టే సరైన నాయకుడు టీడీపీకి ఎన్టీఆరేనని, ఆయన వస్తేనే పార్టీలో గాడిలో పడుతుందని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారట. అయితే, జూనియర్‌ అవసరం పార్టీకి లేదని కొట్టి పారేస్తున్న మరో వర్గం నాయకులు.. పెద్ద ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ పార్టీలో యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారని చెప్పుకొస్తున్నారట. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్‌ను పొలిటికల్‌ స్క్రీన్‌పైకి తీసుకురావడం ఏంటని తేలిగ్గా తీసుకుంటున్నారట.

ఇటు, జూనియర్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు. అందుకే, పదేపదే జూనియర్ ఎన్టీఆర్ పేరును తెర పైకి తీసుకొస్తున్నామని ఓపెన్‌గానే చెబుతున్నారు. టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహమని కొందరు అంటుంటే, ఇప్పటికే పార్టీ వీడిన కొందరు నేతలు జూనియర్ పేరును తెరపైకి తెస్తున్నారని మరికొందరు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి, టీడీపీకి, చంద్రబాబు ఫ్యామిలీకి పెద్దగా గ్యాపేమీ లేకున్నా... ఈ వివాదానికి కావాలనే కొందరు ఆజ్యం పోసేలా ఇలా ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ జూనియర్ గనుక రాజకీయాల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తానని ముందుకొస్తే, టీడీపీలో కీలకమైన బాధ్యతలు అప్పగించడానికి అధినేత చంద్రబాబు ఏనాడూ వెనకాడరని కొందరు కవర్‌ చేస్తున్నారు.

ఇక మహానాడు విషయానికొస్తే... జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఏనాడూ ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన దాఖలాలు లేవంటున్నారు తమ్ముళ్లు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీలో విభేదాలు సృష్టించేందుకే ఇలా జూనియర్‌ పేరు తెరపైకి తీసుకొస్తున్నారని వారంటున్నారు. మహానాడు అనేది క్రియాశీలక కార్యకర్తలను, పార్టీకి సంబంధించిన నేతలను మాత్రమే ఆహ్వానిస్తారని, రాజకీయాలతో సంబంధం లేని, వేరే వృత్తుల్లో ఉన్నవారిని తీసుకొచ్చిన సందర్భాలు లేవని ఉదాహరణలు చూపెడుతున్నారు. ఏమైనా, మహానాడు తెర వెనుక మాత్రం తమ్ముళ్లు జూనియర్ పేరునే జపిస్తున్నారట. మరి మహానాడు వేదికపై జూనియర్ ఎన్టీఆర్‌ తళుక్కుమంటారో, లేదో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories