ప్రత్యక్షమైన విఆర్ కళాశాల రికార్డులు - సీజ్ చేసిన జేసీ వినోద్ కుమార్

ప్రత్యక్షమైన విఆర్ కళాశాల రికార్డులు - సీజ్ చేసిన జేసీ వినోద్ కుమార్
x
Highlights

పట్టణంలో గత రెండేళ్ల నుండి కనిపించకుండాపోయిన విఆర్ విద్యాసంస్థల నిర్వహణ రికార్డులు, శనివారం కళాశాలలోని ఓ గదిలో ప్రత్యక్షమైనాయి.

నెల్లూరు: పట్టణంలో గత రెండేళ్ల నుండి కనిపించకుండాపోయిన విఆర్ విద్యాసంస్థల నిర్వహణ రికార్డులు, శనివారం కళాశాలలోని ఓ గదిలో ప్రత్యక్షమైనాయి. ప్రిన్సిపల్ నుండి సమాచారం అందుకున్న విఆర్ విద్యాసంస్థల ప్రత్యేక అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అక్కడికి చేరుకుని గదిని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పూర్వ విద్యార్ధులు మలిరెడ్డి కోటారెడ్డి, అజయ్ తదితరుల సమక్షంలో రికార్డులు ఉన్న గదిని సీజ్ చేశారు. రెండేళ్ల క్రితం విఆర్ విద్యా సంస్థల పాలక మండలిని ఎన్నిక చెల్లదంటూ, సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక అధికారిని నియమించి పాలక మండలి ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీంతో గత ప్రభుత్వం, విఆర్ విద్యాసంస్థలకు ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్ ను నియమించింది. జేసీ ఆధ్వర్యంలో, పాలక మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా జరిగిపోయింది. ఓటింగ్ మాత్రమే జరగాల్సి ఉంది. ఇదే తరుణంలో, కళాశాలకు సంభంధించిన రికార్డులను బయటపెట్టాలని పూర్వ విద్యార్ధులు పట్టుబడుతూ వచ్చారు. ఈ నేపద్యంలో ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రెండు దఫాలు కళాశాలను సందర్శించి, దాని అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేశారు.

10 రోజుల క్రితం కళాశాలను సందర్శించిన మంత్రి అనిల్, నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. విఆర్సీ మైదానంకు సంబంధించిన అద్దె, హోర్డింగుల ఏర్పాటు ద్వారా వస్తున్న ఆదాయం, తదితర అంశాలకు సంబంధించిన రికార్డులు ఏవని ప్రశ్నించగా, తమ వద్ద లేవని ప్రన్సిపల్ సమాధానమిచ్చారు. వారంలోగా రికార్డులు కళాశాలలో ఉండాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి జాయింట్ కలెక్టర్ కు సూచించారు. మంత్రి ఆదేశాల సందర్భంగా, శనివారం మధ్యాహ్నం రికార్డులు కళాశాలలో ప్రత్యక్షమైనాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories