Andhrapradesh: పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృత స్థాయి సమావేశం

Andhrapradesh: పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృత స్థాయి సమావేశం
x
Highlights

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ప్రధానంగా అమరావతి తరలింపుపై స్పష్టత వస్తే ఏమి చెయ్యాలన్న దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అమరావతిలో రైతుల తరుపున పోరాటం చెయ్యాలని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగా సంక్రాంతి తరువాత విజయవాడ నగరంలో లక్షమందితో కవాతు నిర్వహించే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం.

అమరావతి ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమావేశంలో దీనిపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ నిన్న (శుక్రవారం) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా అమరావతి గ్రామాల రైతులతో నిన్న పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. తుళ్లూరు, మందడం, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు తదితర గ్రామాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు తమ గ్రామాల్లో పరిస్థితులు పవన్‌ కళ్యాణ్‌ కు వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మహిళలను పోలిసులు తిట్టడం బాధ కలిగిస్తోందని.. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వడమే రైతులు చేసిన తప్పా.? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కేవలం రాజధాని రైతుల సమస్య కాదు. ఇది రేపటి రోజున ఎలాగైనా రూపాంతరం చెందవచ్చు అని హెచ్చరించారు. ప్రజలకు ఉద్యమించే హక్కు, నిరసన తెలిపే హక్కు ఉంటుందని అన్నారు. అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే స్థాయిలో రైతులకు మద్దతు పలుకుతానని అన్నారు. రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితులు కల్పిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదేక్రమంలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు తాను వ్యతిరేకం కాదనీ అమరావతి రైతులకు న్యాయం జరగాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories