Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుపై జనసేన స్పందన

Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుపై జనసేన స్పందన
x
Highlights

బెంజి సర్కిల్ లో చంద్రబాబు సహా అమరావతి పరిరక్షణ సమితి ( అమరావతి జేఏసీ) నాయకుల అరెస్టుపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది.

బెంజి సర్కిల్ లో చంద్రబాబు సహా అమరావతి పరిరక్షణ సమితి ( అమరావతి జేఏసీ) నాయకుల అరెస్టుపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన పార్టీ ఆరోపించింది. నిన్న రాత్రి బెంజి సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదుపులోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ ఖండించింది. ఇలాంటి చర్యలు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి హితోపదేశం చేసింది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందరగోళానికి వైసీపీ ప్రభుత్వం తక్షణం తెరదించాలని ఆ పార్టీ కోరింది.

అలాగే అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులను భయబ్రాంతులకు గురి చేస్తూ మహిళల్ని, వృద్ధుల్ని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్న తీరు ఎంతమాత్రం సమంజసం కాదని గత రెండుమూడు రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతుల విషయంలో చోటు చేసుకొంటున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధి అవకాశాలను ఇలాంటి చర్యలు దెబ్బ తీస్తాయని.. అరెస్టులు, నిర్చంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఆ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని ప్రభుత్వాన్ని జనసేన హెచ్చరించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? అంటూ ఇప్పటికైనా ఇటువంటి చర్యలను మానుకోవాలని రాజధాని విషయంపై స్పష్టత ఇవ్వాలని జనసేన కోరుతోంది.

ఇదలావుంటే నిన్న బెంజ్ సర్కిల్ లో చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ తో సహా పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వేదిక కల్యాణ మండపం ప్రారంభోత్సవం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జేఏసీ నేతలు పాదయాత్రగా బయల్దేరగా బయలుదేరారు. దీంతో పాదయాత్రకు అనుమతి లేదంటూ చంద్రబాబు సహా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చంద్రబాబు.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, ఏ చట్ట ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ తో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. కాగా టీడీపీ, జనసేన పార్టీలు అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇవాళ 11 గంటలకు అమరావతిలో తాజా పరిస్థితులపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories