సీఎం జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం : రాపాక వైసీపీలో చేరతారా?

సీఎం జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం : రాపాక వైసీపీలో చేరతారా?
x
Highlights

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు....

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. సోమవారం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ అంశంపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడారు.. ఈ నిర్ణయం స్వాగతించదగిందని ఆయన అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో రాష్ట్రంలో పేద దళితులు మరింత అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని రాపాక తెలిపారు. అలాగే దళితులను సామాజికంగా, ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్‌ అసెంబ్లీలో కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

కాగా ఇంతకుముందే ఇంగ్లీష్ విద్య విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు రాపాక. ఈ విషయంలో రాపాక వైఖరిపై జనసేన అధిష్టానం గుర్రుగా ఉంది. పలుమార్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు రాపాక. గతంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల జనసేన అధిష్టానం పట్ల కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ రాపాకకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదిలావుంటే రాపాక వరప్రసాద్ త్వరలో వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని మెప్పించేలా రాపాక మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరోవైపు రాపాక వైసీపీలో చేరుతారన్న ప్రచారంతో రాజోలు వైసీపీలో అగ్గి రాజుకుంది. ఎవరు పార్టీలో చేరినా తానే ఇంఛార్జిగా కొనసాగుతానని వైసీపీ ఇంచార్జి బొంతు రాజేశ్వరావు అంటున్నారు. అంతేకాదు రాపాక వరప్రసాద్ రిగ్గింగ్ చేసి గెలిచారని రాజేశ్వరావు ఆరోపిస్తున్నారు. దీనిపై తాను హైకోర్టును కూడా అశ్రయించినట్టు తెలిపారు. మంత్రులు పినిపే విశ్వరూప్, కన్నబాబు లతో రాపాక అనుకూలంగా ఉంటున్నారు. దీనిపై బొంతు వర్గం మండిపడుతోంది. త్వరలోనే వైసీపీ అధిష్టానాన్ని కలిసి అన్ని విషయాలు వివరించాలని బొంతు వర్గం భావిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories