డ్రగ్స్ ముఠాను సమర్థిస్తున్న జగన్ : టీడీపీ నేత మేడా

డ్రగ్స్ ముఠాను సమర్థిస్తున్న జగన్ : టీడీపీ నేత మేడా
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత ఆలోచనలతో, మతిలేని ఆరోపణలతో ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ అధికారి ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మండిపడ్డారు.

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత ఆలోచనలతో, మతిలేని ఆరోపణలతో ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ అధికారి ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019-24 మధ్య ఐదేళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది, రాష్ట్రంలో ఇల్లీగల్ మద్యాన్ని ఏరులై పారించింది, గంజాయి, డ్రగ్స్‌ను కాలేజీలు, యూనివర్సిటీలకు సరఫరా చేయించింది జగన్ మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి నగరాల్లో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడితే వాటిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో జగన్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికాయంటే, అప్పట్లో డ్రగ్స్ వాడకం, సరఫరా ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవాలన్నారు. ఏ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూపిస్తున్నాయంటే, అప్పట్లో రాష్ట్రంలో డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నిర్మించి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు సరఫరా చేయించింది వైఎస్సార్సీపీ కాదా అని నిలదీశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి డ్రగ్స్ కేసులో ఈగల్ టీమ్‌కు పట్టుబడితే, 'ఏదో చిన్న పిల్లాడు, తెలియక చేశాడు' అని జగన్ మాట్లాడటం విడ్డూరమన్నారు. నిజాయితీగా పనిచేసే ఈగల్ టీమ్‌కు కొండారెడ్డిపై కక్ష్య ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల గంజాయి, డ్రగ్స్ దందాలో కొండారెడ్డి వాటా లేదా? కాలేజీలు, యూనివర్సిటీల్లో వేలాది మంది విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేయించింది కొండారెడ్డే కాదా అని అని అన్నారు.

తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనాన్ని 'చిన్న విషయం' అనడం, వేల కోట్ల డ్రగ్స్ దందాలో కొండారెడ్డిని 'చిన్న పిల్లాడు' అనడం, కల్తీ నెయ్యి వ్యవహారంలో పట్టుబడిన వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సంబంధం లేదని చెప్పడం... ఇన్ని అబద్ధాలు చెప్పడానికి జగన్‌కు మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఐదేళ్ల పాలనలో డ్రగ్స్, కల్తీ నెయ్యి వ్యవహారాలతో పాటు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. జగన్ చేసిన విధ్వంస పాలన, 30 యాక్ట్, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి ఇసుక, మద్యం వంటి కుంభకోణాల్లో లక్షల కోట్లు దండుకున్న జగన్ ని, ఆయన సామంత రాజులను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. ఇంత దారుణంగా పాలించారు కాబట్టే ప్రజలు 11 సీట్లు ఇచ్చారని అన్నారు. ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి అసత్య ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. జగన్ నియంతృత్వ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారిని శిక్షించాలని, నాశనమైన వ్యవస్థలను బాగు చేయాలని అన్నారు. వ్యవస్థలను నాశనం చేయడంలో వైఎస్ కుటుంబం దిట్టలని, రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రారంభమైన విధ్వంసం జగన్ పాలనలో పీక్స్ కు చేరిందని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు యువతను సాఫ్ట్‌వేర్ వైపు, అభివృద్ధి వైపు నడిపిస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ వైపు మళ్లిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే యువతను ఇలా తప్పుదారి పట్టించడం మానుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ఔన్నత్యాన్ని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని గమనించాలని మేడా విజయ శేఖర్ రెడ్డి కోరారు. రాష్ట్రాన్ని 'డ్రగ్స్ రహిత రాష్ట్రంగా' తీర్చిదిద్దడానికి ఈగల్ టీమ్స్‌తో పాటు లా అండ్ ఆర్డర్ బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తుందన్నారు. హోం మంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ దృష్టి సారించి రాష్ట్రంలో డ్రగ్స్‌ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories