ఇసుక కొరతకు కారణం ఇదేనా!

ఇసుక కొరతకు కారణం ఇదేనా!
x
Highlights

గత కొన్ని నెలలుగా భారీ వర్షాల కారణంగా నదుల్లోకి పెద్దఎత్తున నీరు చేరడంతో ఇసుక దొరకడంలేదు. దీని వల్ల నిర్మాణ రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వం...

గత కొన్ని నెలలుగా భారీ వర్షాల కారణంగా నదుల్లోకి పెద్దఎత్తున నీరు చేరడంతో ఇసుక దొరకడంలేదు. దీని వల్ల నిర్మాణ రంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఇసుక సరఫరా చేయాలని, నిర్మాణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని భవన నిర్మాణ కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ఒక వైపు, నిర్మాణ కార్యకలాపాలు బాగా ఆగిపోవడంతో వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, చిన్న మరియు పెద్ద కాంట్రాక్టర్లు, రియల్టర్లు, డెవలపర్లు కూడా రాజధాని ప్రాంతంలో ఇసుక లభించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక దొరక్క రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిలో జరుగుతున్న అనేక వందల కోట్ల రూపాయల విలువైన పనులు ఆగిపోయాయి.

చాలా మంది డెవలపర్లు అపార్టుమెంటుల నిర్మాణానికి భూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొరత కారణంగా ఒక ట్రక్ లోడ్ ఇసుకను రూ .20 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు అదే ట్రక్ లోడ్ ఇసుకను రూ .5 వేల నుంచి రూ .7 వేల మధ్య విక్రయించారు. అయితే ఆ సమయంలో యదేచ్చగా ఇసుక దోపిడీ జరిగింది. రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఇసుక బోంచేశారు.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఒక్క పైసా కూడా రాలేదు. కానీ ఈసారి అలా జరగకుండా ఉండాలనే ఉంద్దేశ్యంతో ప్రభుత్వమే పకడ్బందీగా ఇసుకను సరఫరా చేస్తోంది. ఇది ఒకవిధంగా మంచి పనే అయినా తగ్గని వరదల కారణంగా నదుల్లోని ఇసుకను బయటికి తీయలేకపోతున్నారు. వరద తగ్గింది అని అనుకునే లోపే ఎగువ రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. నదుల్లో నీరు పారుతున్నప్పుడు ఇసుకను తీయడం అసాధ్యం. దాంతో ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలైంది.

చాలా మంది డెవలపర్లు షేరింగ్ ప్రాతిపదికన అపార్ట్మెంట్ ఫ్లాట్ల నిర్మాణంపై భూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు, కొంతమంది డెవలపర్లు ఇసుక లభ్యత లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులను తీసుకోవడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇసుక క్వారీల నుండి ఇసుకను తీయాల్సి ఉన్నా.. రెండు జిల్లాల్లోని ఇసుక క్వారీల నుండి వరద నీరు తగ్గలేదు. దాంతో ఇసుక సరఫరా చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం నానా అవస్థలు పడుతోంది. మరోవైపు, ఇసుక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, తగినంత పరిమాణంలో ఇసుక సరఫరా చేయడానికి చర్యలు తీసుకోలేదని భవన కార్మికుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పనుల ఆలస్యం కారణంగా నిర్మాణ వ్యయాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. బ్యాంక్ వడ్డీ రేటు సుమారు 16 శాతం ఉందని, ఇసుక లభ్యత లేకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం అయితే ఖర్చులు మరింత పెరుగుతాయని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక లభ్యత లేకపోవడంతో నిర్మాణ రంగంలో సమస్య ఉందని అంగీకరించారు.. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడై) ఏపీ చాప్టర్ చైర్మన్ ఎ శివారెడ్డి. అయితే వరదలు కారణంగా ప్రభుత్వం ఇసుకను తగినంత పరిమాణంలో సరఫరా చేయలేకపోయిందని ఆయన అన్నారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం అయితే సహజంగానే నిర్మాణ వ్యయం పెరుగుతుందని శివారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం వెంటనే 250 క్వారీలను తెరిచి ఇసుక సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ భవనం, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి పి నరసింహారావు డిమాండ్ చేశారు. దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన అన్నారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇసుకను బయటకు తోడాలంటే నదుల్లోని నీరు వెళ్లిపోవాలన్న విషయం గుర్తెరగాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories