బాబు ఇండియాలో ల్యాండయ్యే లోపు మరో షాక్ తప్పదా?

బాబు ఇండియాలో ల్యాండయ్యే లోపు మరో షాక్ తప్పదా?
x
Highlights

అటు చంద్రబాబు యూరప్‌ ఫ్లైటెక్కగానే, ఇటు టీడీపీ ఎంపీలు బైబై బాబూ అంటూ సైకిల్‌ దిగేశారు. కమలం బాట పట్టేశారు. మొన్నటి వరకూ బీజేపీని తిట్టినతిట్టు...

అటు చంద్రబాబు యూరప్‌ ఫ్లైటెక్కగానే, ఇటు టీడీపీ ఎంపీలు బైబై బాబూ అంటూ సైకిల్‌ దిగేశారు. కమలం బాట పట్టేశారు. మొన్నటి వరకూ బీజేపీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువా కప్పుకుని, మోడీ జపం మొదలుపెట్టారు. మరి లోక్‌సభలో ఉన్న ముగ్గురే ముగ్గురు టీడీపీ ఎంపీల దారెటు ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ. రాజ్యసభలో పార్టీ ఖాళీ అయ్యింది ఇక లోక్‌సభలోనూ టులెట్‌ బోర్డేనా అంటూ స్పెక్యులేషన్స్‌ మొదలయ్యాయి. మరి ముగ్గురు తమ్ముళ్ల పయనమెంటు...? యూరప్‌ నుంచి బాబు ల్యాండయ్యేలోపు లోక్‌సభ నుంచి షాకిస్తారా?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన తెలుగుదేశం పునాదులు, కదిలిపోతున్నాయి. నాడు చంద్రబాబు ఫిరాయింపుల సూత్రాన్ని, కమలం కూడా ట్రై చేస్తోంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను తనలో విలీనం చేసుకుంది. అంటే రాజ్యసభలో ఇప్పుడు టీడీపీ లేదు. సరే రాజ్యసభ సభ్యులు తెలుగుదేశానికి రాజీనామా చేసి, కమలంలో విలీనమయ్యారు. ఇప్పుడు మిగిలింది లోక్‌సభనే. గెలిచిన ముగ్గురే ముగ్గురు ఎంపీల చుట్టూ కూడా, జంపింగ్‌ జపాంగ్‌ వార్తలే చక్కర్లు కొడుతుండటం, టీడీపీలో కలవరం కలిగిస్తోంది. ముగ్గురు ఎంపీల మోడీ భజన ఊహాగానాలకు బలమిస్తోంది. నిజంగా వీరు కూడా కాషాయ కండువా కప్పుకుంటారా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌ నాయుడు. ఎన్నికలు ముగిసిన తర్వాత వీరిపై రకరకాల వార్తలొచ్చాయి. ముఖ్యంగా పార్లమెంట్‌లో పదవుల పంపకం, నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని భగ్గుమనేలా చేసింది. గల్లా జయదేవ్‌ను టీడీపీ పక్ష నేతగా నియమించడం, తనను విప్‌గా పెట్టడంపై కేశినేని నాని రగిలిపోయారు. జూనియర్‌కు అంతటి ప్రాధాన్యమిచ్చి, సీనియర్‌నైన తనను తీసిపారేసినట్టుగా వ్యవహరిస్తున్నారని ఫీలయ్యారు. అంతటి భారాన్ని తాను మోయలేనంటూ ఫేస్‌బుక్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నానితో బీజేపీ అగ్రనాయకులు టచ్‌లో ఉన్నారని, ఆయన పార్టీ మారడం ఖాయమన్న ఊహాగానాలొచ్చాయి. వాటిని నాని కూడా ఖండించలేదు.

ఇక పార్లమెంట్‌లో టీడీపీ పక్ష నేతగా నియమితులైన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌‌‌‌, మరో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పార్టీ మార్పుపై ఊహాగానాలు పెద్దగా రాలేదు. అయితే, ఏపీలో పాగా వేసి, టీడీపీని రీప్లేస్ చేద్దామనుకుంటున్న బీజేపీ మాత్రం, ముగ్గురిపై కాన్‌సన్‌ట్రేట్ చేసిందని తెలుస్తోంది. ఢిల్లీలో కేశినేని నానిని సంప్రదిస్తున్న బీజేపీ అగ్రనేతలు, మిగిలిన ఇద్దర్నీ తీసుకురావాలని చెబుతున్నారట. లోక్‌సభలో ఉన్న మొత్తం టీడీపీని, బీజేపీలో విలీనం చేయాలని, అప్పుడు ఫిరాయింపుల చట్టాన్ని కూడా తప్పించుకోవచ్చని సలహా ఇస్తున్నారట. రాజ్యసభ టీడీపీ సభ్యుల చేరిక తర్వాత, లోక్‌సభ టీడీపీ ఎంపీల వంతు వస్తుందని ఢిల్లీలో ఊహాగానాలు వినిపించాయి. టీడీపీ రాజ్యసభ విలీనం పూర్తయ్యింది. మిగిలింది లోక్‌సభ టీడీపీ సభ్యులే. చంద్రబాబు యూరప్‌ పర్యటన ముగించుకుని వచ్చేలోపు లోక్‌సభలోనూ తెలుగుదేశం ఖాళీ అవుతుందని కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు. అంటే పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ టీడీపీ పేరు ఇక వినిపించదేమో.

మొత్తానికి భూమి గుండ్రంగా ఉంటుందనడానికి ఈ జంపింగ్‌ జపాంగ్‌లే నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను యథేచ్చగా ప్రోత్సహించిన చంద్రబాబు, ఇప్పడు తన పార్టీ ఎంపీల ఫిరాయింపులపై సాధికారంగా సమాధానం చెప్పలేని పరిస్థితికొచ్చారు. ఒకవేల ఖండిస్తే, మరి మీరు చేసిందేంటన్న ప్రశ్న ఆటోమేటిక్‌గా దూసుకొస్తుంది. ఏపీలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు తట్టాబుట్టా సర్దుకుని కమలం బాట పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరి రానున్న ఐదేళ్ల కాలంలో ఏపీలో పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories