Godavari Floods: మరోసారి గోదావరికి పెరిగిన వరద ప్రవాహం

Increased Flood Flow to Godavari
x

Godavari Floods: మరోసారి గోదావరికి పెరిగిన వరద ప్రవాహం

Highlights

Godavari Floods: ఆందోళన చెందుతున్న ఏలూరు జిల్లా ముంపు గ్రామాల ప్రజలు

Godavari Floods: ఏలూరు జిల్లాలో జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన గోదావరి వరదలను మరవకముందే.. మరోసారి గోదావరి నదిలోకి వరదనీటి ప్రవాహం పెరగడం ముంపు గ్రామాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. అల్పపీడన ప్రభావం వలన కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మళ్లీ గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. రికార్డు స్థాయి ప్రవాహాలను నమోదుచేస్తూ గంటగంటకూ వరద ఉధృతితో పరవళ్లు తొక్కుతోంది. కుక్కునూరు, గోమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో గ్రామాల ప్రజలు స్వచ్చందంగా పునరావాస కాలనీలు తరలి వెళ్తున్నారు. కిన్నెరసాని నదిలోకి గోదావరి వరదనీరు చేరి సీతారామ నగరంకు వెళ్లే రహదారిపైకి వరదనీరు రాకపోకలు నిలిచిపోయాయి.

పాలవాగు పొంగి ముత్యాలమ్మపాడు, కౌండిన్యముక్తి గ్రామాలకు వెళ్లే రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, దాచారం మధ్య గుండేటి వాగు కాజ్వే పైకి వరద నీరు చేరి ప్రధాన రహదారిని ముంచెత్తింది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీరంతా మండల కేంద్రానికి రావాలంటే చుట్టూ 15 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో వేలేరుపాడు-రుద్రంకోట గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి పైకి వరద చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. యడవల్లి వద్ద ఉన్న ఎద్దు వాగులోకి గోదావరి వరద నీరు చేరడంతో.. ఎద్దు వాగు వంతెన పూర్తిగా నీటమునిగింది. దీంతో సుమారు 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వేలాది ఎకరాల్లో సాగుచేసిన పత్తి, మిర్చి, వరి మొక్కజొన్న పంటలు నీట మునగడంతోరైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి మరింత వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదులలోకి దిగవద్దని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories