హిందూపురంలో యువత పక్కదారి.. డ్రగ్స్‌కు బదులు యువత కొత్త దారులు

Illegal Sale of Liquor and Drugs in Hindupur | AP News
x

హిందూపురంలో యువత పక్కదారి.. డ్రగ్స్‌కు బదులు యువత కొత్త దారులు

Highlights

*వైద్యుల సిఫార్సు లేకుండా విక్రయిస్తున్న మందుల దుకాణాలు

Hindupuram: మత్తుకోసం యువత అడ్డదారులు తొక్కుతోంది. మందుల దుకాణంలో దొరికే మాత్రలు విచ్చలవిడిగా వాడుతూ డ్రగ్స్‌కు బానిసవుతున్నారు. ప్రాణాంతకమైన క్యాప్సుల్స్ వాడుతూ మత్తులో జోగుతున్నారు. ఇది ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో చదువురాని వారు చేస్తున్నది కాదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కొంత కాలంగా బహిరంగంగా సాగుతున్న తంతు. వైద్యుల సిఫార్సు లేకుండానే పెద్ద ఎత్తున అమ్మాకాలు సాగిస్తున్నారు.

హిందూపురంలో కొత్త రకం దందాకు తెరలేపారు అక్కడి యువత. మద్యాపానానికి ప్రత్యామ్నాయంగా రకరకాల రసాయనాలు, జెల్‌లు వాడుతున్నారు. మందుల దుకాణం యజమానులు సైతం విచ్చలవిడిగా.. వైద్యుల సిఫార్సు లేకుండానే మాత్రలు సరఫరా చేస్తుండటంతో పెద్దఎత్తున యువత మాత్రలు కొనుగోలు చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, యువకులు ఎక్కువగా ఒకే రకం మాత్రలు విరివిగా కొనుగోలు చేస్తుండటంపై hmtv క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

హిందూపురంలోని ముక్కిడిపేట, అహ్మద్‌నగర్ సహా పలు శివారు కాలనీల్లో జోరుగా మాత్రల వినియోగం కలకలం రేపుతోంది. మందుల దుకాణాల్లో యువత Spasmo-Proxyvon Plus అనే మాత్రలను వంద రూపాయలకు పది అమ్ముతున్నారు. ఐదు నుంచి పది మాత్రలు వేసుకుంటే మద్యం ఫుల్ బాటిల్ సేవించినంత మత్తు వస్తుంది. దీంతో కాలేజీ విద్యార్థులు, యువకులు వీటిని పెద్దఎత్తున వాడుతున్నారు. సాదారణంగా కడుపునొప్పికి, మహిళలకు శస్త్రచికిత్స చేసినప్పుడు వీటిని వైద్యుల సూచన మేరకు వాడుతారు. అయితే హిందూపురంలో యువత కొంత కాలంగా ఇలాంటి మాత్రలు విరివిగా వాడుతున్నారు. వైద్యుల సిఫార్సు లేకుండా పెద్ద ఎత్తున ఇలాంటి మందులు విక్రయించరాదని తెలిసినా కాసులకు కక్కుర్తి పడి కొందరు మందుల దుకాణం దారులు బహిరంగంగా అమ్ముతున్నారు. యువత ఇలాంటి వాటికి అలువాటు పడితే ఆరోగ్యం పాడవుతుందని.. నరాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల నుంచి అడ్డాకూలీల వరకూ అందరూ మత్తు కోసం మాత్రలు వాడుతున్నారు. మందుల అమ్మకాలపై పర్యవేక్షణ కొరవడడం, యంత్రాంగం చోద్యం చూస్తుండటంతో హిందూపురంలో ఇలాంటివి యథేచ్ఛగా సాగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.

కర్ణాటక సరిహద్దు కావడంతో ఇప్పటికే హిందూపురంలో అక్రమ మద్యం, డ్రగ్స్ అమ్మకాలు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండడంతో యథేచ్ఛేగా డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారలు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలేని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories