బందరు వాసుల కల నెరవేరబోతోందా? పోర్టుకు భారీ రుణం..

బందరు వాసుల కల నెరవేరబోతోందా? పోర్టుకు భారీ రుణం..
x
Highlights

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను ఏపీ ప్రభుత్వం తప్పిస్తూ ఆగస్టు 8న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ పోర్టు...

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను ఏపీ ప్రభుత్వం తప్పిస్తూ ఆగస్టు 8న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ పోర్టు నిర్మాణానికి ఇంకా కొత్త కాంట్రాక్టర్ ను ఎంపిక చేయలేదు. దాంతో పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న వాదనలు వినబడుతున్న తరుణంలో ప్రభుత్వం బందరు పోర్టును నిర్మిస్తుందని మంత్రులు చెప్పారు. అయితే నిర్మాణం మాత్రం మొదలుకాలేదు. దీనికి కారణం నిధుల కొరతే.. పోర్టు నిర్మాణానికి దాదాపు రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఋణం ఇచ్చేందుకు కెనరా బ్యాంకు ముందుకొచ్చింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన రూ. 4 వేల కోట్లు రుణంగా ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధమైంది.

కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌ఏ శంకర్‌నారాయణ మంగళవారం సీఎం జగన్‌ తో సమావేశం అయ్యారు. సుమారు అరగంటకుపైగా వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బందరు పోర్టు నిర్మాణ అంశం చర్చకు వచ్చిందని ఎంపీ బాలశౌరి తెలిపారు. పోర్టు నిర్మాణానికి సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పోర్టు నిర్మాణం త్వరలోనే మొదలవుతుందని ఎంపీ స్పష్టం చేశారు. దీంతో బందరు వాసుల కల త్వరలోనే సాకారం కానుందని ఆయన అన్నారు.

కాగా బందరు పోర్టు నిర్మాణాన్ని గత ప్రభుత్వం నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు అప్పగించింది. అయితే నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమైన పనులు మొదలు కాలేదని వైసీపీ ప్రభుత్వం.. పోర్టు బాధ్యతల నుంచి నవయుగను తప్పించింది. అయితే జీవో నెంబరు 66ను సవాల్ చేస్తూ నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. బందరు పోర్టు ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని నవయుగ సంస్థ హైకోర్టుకు తెలిపింది.

బందరు పోర్టు ఒప్పందం రద్దుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి శ్యాంప్రసాద్ ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఇంధన, పెట్టుబడుల(పోర్ట్‌) శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోర్టుల డైరెక్టర్‌, మచిలీపట్నం తహశీల్దార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఏపీ ప్రభుత్వం, కెనరా బ్యాంకు మధ్య ఒప్పందం కుదిరిన వెంటనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories