ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. సముద్రంలోకి భారీగా వరద నీరు

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. సముద్రంలోకి భారీగా వరద నీరు
x
Highlights

గతకొన్నిరోజులుగా పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పోటెత్తుతోంది. దానికి తోడు తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణమ్మ

గతకొన్నిరోజులుగా పడమటి కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పోటెత్తుతోంది. దానికి తోడు తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణమ్మ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు మరోసారి నిండాయి. దాంతో వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉజ్జయినిలోకి భీమా వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో మిగులుగా ఉన్న 65 వేల క్యూసెక్కులను దిగువన ఉన్న కృష్ణానదికి విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాలలోకి 3.65 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ఇటు బుధవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయంలోకి 4.35 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో..

జలాశయానికి భారీగా మిగులు జలాలు వచ్చినట్టయింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు మరోసారి నీరు విడుదల చేశారు. ఇంకా నీరు మిగిలిపోవడంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 4.35 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఇటు నాగార్జునసాగర్‌లోకి 4.47 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.34 లక్షల క్యూసెక్కులను 18 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పులిచింతల స్టోరేజి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం మరింత పెరిగింది..

ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులోకి 3.55 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో చేరుతుండగా.. 2.10 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద అంతకంతకు పెరుగుతోంది. బ్యారేజీలోకి 2.10 లక్షల క్యూసెక్కులు వస్తుండటంతో డెల్టా కాలువలకు విడుదల చేశారు.. అలాగే 1.88 లక్షల క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories