ఏపీలో కరోనా బాధితులకు ఇంట్లోనే చికిత్స.. ఆ జిల్లాలోనే తొలిసారి

ఏపీలో కరోనా బాధితులకు ఇంట్లోనే చికిత్స.. ఆ జిల్లాలోనే తొలిసారి
x
Highlights

ఏపీలో తొలిసారి కరోనా పాజిటివ్ బాధితులకు ఇంట్లోనే చికిత్స అందుస్తున్నారు.

ఏపీలో తొలిసారి కరోనా పాజిటివ్ బాధితులకు ఇంట్లోనే చికిత్స అందుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముగ్గురు కరోనా వైరస్ సోకిన వారికి హోం ఐసోలేషన్‌ ఉంటూ.. చికిత్స పొందే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. రాష్టంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువతున్న తరుణంలో ఇతర దేశాల తరహాలో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా.. చెన్నై నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన దంపతులుతో పాటుగా వారి బంధువు ఒకరు రాజమహేంద్రవరానికి వచ్చారు. ఈ ముగ్గురితో పాటు కుటుంబంలో వేరెవ్వరికీ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. కానీ తమిళనాడు నుంచి రావడంతో తొలుత ట్రూనాట్‌, తర్వాత ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయగా, ఈ ముగ్గురికీ కరోనా పాజిటివ్‌ అని శుక్రవారం వెల్లడైంది. కానీ ఆసుపత్రిలో కాకుండా ఇంటివద్దే చికిత్స తీసుకోడానికి వారు మొగ్గు చూపారు. దీంతో వారికి పల్స్‌ ఆక్సీమీటర్‌, అవసరమైన మందులు, హ్యాండ్‌వాష్‌, ఇతర సరంజామాతో కూడిన కిట్‌ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందించారు.

అలాగే ఎప్పటికప్పుడు వీడియోకాల్‌ విధానం ద్వారా వైద్యుల సలహాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. చేతికి అమర్చిన పల్స్‌ ఆక్సీమీటర్‌లో రీడింగ్‌ 92 కంటే తక్కువ చూపిస్తే వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వీరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఇతర అనారోగ్య లక్షణాలు ఏమీ లేకపోవడంతో రాష్ట్రస్థాయి అధికారుల అనుమతితో ఈ అవకాశం కల్పించినట్లు వైద్యులు తెలిపారు. వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి సుముఖంగా లేరని, అందుకే కోవిడ్ లక్షణాలున్నా గోప్యంగా ఉంచుతున్నారని కలెక్టర్ వెల్లడించారు.

ఏపీలో శుక్రవారం 62 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసులకు గాను 1731 మంది డిశ్చార్జ్ కాగా, 55 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 728 గా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories