Pawan Kalyan: నేడు కర్నూలుకు పవన్ కళ్యాణ్... పవన్ పర్యటనపై ఉత్కంఠ

Pawan Kalyan: నేడు కర్నూలుకు పవన్ కళ్యాణ్... పవన్ పర్యటనపై ఉత్కంఠ
x
నేడు కర్నూలుకు పవన్ కళ్యాణ్... పవన్ పర్యటనపై ఉత్కంఠ
Highlights

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పార్టీని...

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. దీంతో నేటి నుంచి రెండు రోజులపాటు పర్యటించేలా జిల్లా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ను అడ్డుకునేందుకు రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. క్యాపిటల్ విషయంలో పవన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో పవన్ జిల్లా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నానికి కర్నూలు చేరనున్న పవన్ సాయంత్రం 3గంటలకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. 2017లో జరిగిన ఓ విద్యార్థిని హత్య కేసులో ఇంకా న్యాయం జరగలేదని రాజ్ విహార్ సర్కిల్ నుంచి కోట్ల సర్కిల్ వరకూ ఈ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం కోట్ల సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.

ఇక రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్విరామంగా పలు కార్యక్రమాల్లో పవన్‌కల్యాణ‌్ పాల్గొంటారు. నగర శివారులోని జొహరాపురం వంతెనను సందర్శించి, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బి.తాండ్రపాడు సమీపంలో అసంపూర్తిగా ఉన్న జీ ప్లస్ 2 గృహాలను పరిశీలించి నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులతో చర్చిస్తారు. అదేరోజు ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాలకు పవన్ హాజరవుతారు. అక్కడ ఆగిపోయిన టెక్స్‌టైల్ పార్క్, ఆక్రమణలకు గురైన స్థలాన్ని పరిశీలిస్తారు. అలాగే, వీవర్స్ కాలనీలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు పవన్‌ కల్యాణ్.

అయితే, కర్నూలుకు హైకోర్టు రాకుండా పవన్ కల్యాణ్ అడ్డుతగులుతున్నారని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కర్నూలు వస్తే పవన్‌ను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. రాయలసీమ అభివృద్ధికి పాటుపడాలని, లేకుంటే ఆయన్ను అడ్డుకుంటామని చెబుతున్నారు. జనసేన నేతలు మాత్రం ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు వస్తున్న తమ నేతను అడ్డుకోవడం సరికాదంటున్నారు. విద్యార్థుల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి పవన్ కర్నూలు జిల్లా పర్యటనపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి పవన్ పర్యటన కర్నూలు జిల్లాలో ఎంత వరకు సజావుగా జరుగుతుందో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories