తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. నేడు కోస్తా, రాయలసీమల్లో..

తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. నేడు కోస్తా, రాయలసీమల్లో..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలను వానలు అతలాకుతలం...

ఆంధ్రప్రదేశ్ లో భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల ధాటికి వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడ, విజయవాడ, రాజమహేంద్రవరం నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. దీంతో రాత్రంతా ఆయా ప్రాంతాలవాసులు నీటిలోనే గడిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృతరూపం దాల్చడంతో కృష్ణా కరకట్టపై ఉన్న దాదాపు 30 ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే అధికారులు నోటీసులు ఇచ్చారు.

వర్షాల తోపాటు ఈదురు గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు అక్కడక్కడా దెబ్బతిన్నాయి. అంతేకాదు అనేక చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి. ఇదిలావుంటే విశాఖపట్నం – నర్సాపూర్‌ మధ్య కాకినాడకు 30 కి.మీ దూరంలోని నేమం ప్రాంతంలో తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories