Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటి నుంచి ఏపీలో వర్షాలు

Heavy Rains in Andhra Pradesh due to Low Pressure in Bay of Bengal
x

రేపటి నుంచి ఏపీలో వర్షాలు(ఫైల్ ఫోటో)

Highlights

* 17,18 తేదీల్లో విశాఖ, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం * ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై భారీ వర్షాలు

Low Pressure: ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. థాయ్‌లాండ్, అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని రేపటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి ఏపీ తీరంలో 17, 18 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తుపానుగా మారాక దీనికి 'జవాద్‌'గా నామకరణం చేయనున్నారు. విశాఖ, కాకినాడ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఏపీ తీరానికి 1,200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురు వానలు కురిశాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల కుండపోత వానలు కురిశాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

17 నుంచి తీరం దాటే వరకూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఎవరూ వేటకు వెళ్లొద్దని, వేటకు వెళ్లిన వారు 15కల్లా తిరిగి వెనక్కి వచ్చేయాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వైపు వచ్చి మరింత బలహీనపడింది. మయన్మార్‌కు సమీపంలో ఏర్పడిన అధిక పీడన ప్రాంతం కారణంగా ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంపై బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల రెండ్రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలూ కురవొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories