Godavari Floods: మళ్లీ గోదావరి ఉగ్రరూపం

Heavy Floods In Godavari | AP News
x

Godavari Floods: మళ్లీ గోదావరి ఉగ్రరూపం

Highlights

Godavari Floods: ధవళేశ్వరం వద్ద 13 అడుగులు దాటిన నీటిమట్టం

Godavari Floods: ఎగువన భారీ వర్షాలతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 13 అడుగులు దాటింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.19 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. 13లక్షల16వందల38 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి ఘాట్లను మూసివేశారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

ముంపు ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 N.D.R.F , 3 S.T.R.F బృందాలను రెడీగా ఉంచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో N.D.R.F బృందాలు అందుబాటులో ఉన్నాయి. అమలాపురంలో రెండు S.T.R.F బృందాలను రెడీగా ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఒక N.D.R.F టీమ్ అందుబాటులో ఉంది. VRపురంలో మరో S.T.R.F బృందం సిద్ధంగా ఉంది.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.50 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 53అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. చింతూరులోని 25 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కుక్కునూరు - దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడులో 40 గ్రామాలను వరదచుట్టుముట్టింది.

కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లక్ష్మి బ్యారేజీ 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్ష్మి బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 9 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. సరస్వతి బ్యారేజీ 66 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 97వేల500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories