Weather Update : మార్చిలోనే మంటలు..నేడు 41 డిగ్రీల పీక్ ఎండలు..తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్ అలర్ట్

Weather Update
x

Weather Update

Highlights

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. నేడు తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Weather Update : వేసవి కాలం అప్పుడే మొదలైందా? అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడు మార్చిలోనే నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేడు (మార్చి 6, శుక్రవారం) ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణలో ఎండల సెగ

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నిన్న ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. నేడు నార్త్, ఈస్ట్ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వరంగల్, జగిత్యాల, ఆసిఫాబాద్‌లలో ఎండలు పీక్స్‌కు చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్‌లో కూడా 37-38 డిగ్రీల వేడి ఉండవచ్చు. రాబోయే 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.

ఏపీలో వడగాలుల ముప్పు

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండలు సాధారణం కంటే ఎక్కువగా మండుతున్నాయి. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్ర ప్రాంతాల్లో ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు

ఎండల బారి నుంచి రక్షించుకోవడానికి వైద్యులు, వాతావరణ శాఖ కొన్ని కీలక సూచనలు చేశాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించాలి, తలకు టోపీ లేదా గొడుగు వాడాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మంచినీళ్లు, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్ వేయడం, ఇంట్లో మొక్కలు పెంచడం ద్వారా గదులను చల్లగా ఉంచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories