ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త.. వచ్చే సీజన్‌కు నీళ్లు

ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త.. వచ్చే సీజన్‌కు నీళ్లు
x
Highlights

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అధిక నిధులే కేటాయించింది.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అధిక నిధులే కేటాయించింది. నిర్మాణ దశలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులైన పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులకు ఇటీవల రివర్స్ టెండరింగ్ పూర్తి చేసి పనులు కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం పోలవరం పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులు కూడా వేగం పుంజుకున్నాయి. వెలిగొండ రెండు టన్నెల్ లలో ఒకటి దాదాపు పూర్తికావొచ్చింది. 18.8 కిలోమీటర్లు పొడవున్న రెండు టన్నెల్ తవ్వకం పనుల్లో మొదటి టన్నెల్ లో ఒకటిన్నర కిలోమీటరు, రెండో టన్నెల్ లో 7.5 కిలోమీటర్ల పనులు పెండింగులో ఉన్నాయి.

వచ్చే ఏడాది మొదటి టన్నెల్ నిర్మాణాన్నిపూర్తి చేసి జూన్ కల్లా వెలిగొండకు 10 టీఎంసీ ల నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది వెలిగొండకు శ్రీశైలం నుంచి నీరు ఇస్తామని ఏపీ జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరు, నెల్లూరు జిల్లాలో వెనకపడ్డ ఉదయగిరి నియోజకవర్గం, కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలోని 30 మండలాలలోని 15 లక్షల మందికి తాగునీరు, మొత్తం 459,000 ఎకరాలకు సాగు నీరు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పశ్చిమ ప్రకాశం ప్రాంతం తీవ్ర నీటి ఎద్దడికి గురవుతోంది.

ఈ ప్రాంతంలో ఉన్న మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలకు త్వరలో వెలిగొండ నీరు అందనుంది. ప్రభుత్వం భావిస్తున్నట్టు వచ్చే ఏడాది జూన్ కల్లా నీరు ఇవ్వగలిగితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చెసినట్టవుతుంది. కాగా ప్రస్తుతం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణం జరిగుతోంది. శ్రీశైలం డ్యాం ఎగువున నల్లమల అడవిలో "కొల్లం వాగు" కృష్ణా నదిలో కలిసేచోట నుంచి 43.5 టీఎంసీ ల వరద నీటిని 200 మీటర్ల అప్రోచ్ కాలువతో పారించి అక్కడి నుంచి 18.8 కి.మీ పొడవున 2 సమాంతర సొరంగాల ద్వారా దోర్నాల కర్నూలు రహదారిలో "కొత్తూరు" వరకు నీటిని పంపిస్తారు.

అక్కడి నుంచి రెండు కొండల శ్రేణిలో మధ్య సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు గ్రామాల దగ్గర ఆనకట్టలు కట్టి సుమారు 22 కి.మీ పొడవైన "నల్లమల సాగర్" రిజర్వాయర్ను నిర్మించారు.. ఇక్కడికి నీటిని పంపిస్తారు. ఇందులో దాదాపు 45 టీఎంసీ ల నీరు స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ నీటిని శ్రీశైలం మిగులు జలాల నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 45 రోజులపాటు కృష్ణానదికి వరద వస్తేనే కుదురుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories